వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపుపై గాంధీ భవన్‌లో జరిగిన పీఈసీ సమావేశంలో నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల ప్రస్తావన వచ్చింది. మహేశ్ గౌడ్ , ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది.
వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా టీ. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపుకు సంబంధించి పీఈసీలో వాడివేడి చర్చ జరిగింది. బీసీలకు ఎన్ని నియోజకవర్గాలు ఇస్తారో, ఎక్కడెక్కడ ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ వీహెచ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో పీఈసీలో ఒక్కో సభ్యుడు ఒక మహిళా అభ్యర్ధిని సిఫారసు చేయాలని రేణుకా చౌదరి కోరారు. మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చేది ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు సర్వేలపై మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సీరియస్ అయ్యారు. సర్వేలను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చేటప్పుడు ఈ ప్రక్రియ ఎందుకని బలరాం నాయక్ నిలదీశారు. కొన్ని నియోజకవర్గాల్లో 2, మరికొన్ని చోట్ల 20 దరఖాస్తులు ఎలా వచ్చాయని కొందరు సీనియర్ నేతలు ప్రశ్నించారు.
Also Read: జెట్ స్పీడ్‌లో బీఆర్ఎస్.. పని మొదలెట్టిన కాంగ్రెస్, సర్వేల దశలోనే బీజేపీ ..తెలంగాణలో రాజకీయాలు ఇలా
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్ధులు, కుల సమీకరణపైనే చర్చించామని అన్నారు. పది రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు. కోవర్టులున్నరన్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. మర్రి జనార్ధన్ రెడ్డి కామెంట్లపైనా సీరియస్‌గా స్పందించారు జగ్గారెడ్డి. ఇది మొదటి సమావేశం మాత్రమే అన్నారు. ఆ రెండు సీట్ల మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జగ్గారెడ్డి చెప్పారు.
ఇకపోతే.. ఈ సమావేశంలో ఒకే కుటుంబానికి రెండు సీట్ల ప్రస్తావన వచ్చింది. మహేశ్ గౌడ్ , ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. రెండు సీట్ల చర్చ ఇప్పుడు ఎందుకు అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎవరిని టార్గెట్ చేసి చర్చ చేస్తున్నారంటూ ఉత్తమ్ ఫైర్ అయ్యారు. మధ్యలో జోక్యం చేసుకున్న బలరాం నాయక్.. రెండు సీట్లపై ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు.
