తెలంగాణలో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎవరికీ అందని స్పీడ్‌లో వుంటే, కాంగ్రెస్ పని మొదలెట్టింది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సర్వేల దశలోనే వుంది.
తెలంగాణలో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి బీఆర్ఎస్ దూకుడు మీదుంది. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన నాలుగు స్థానాలకు సీఎం కేసీఆర్ టికెట్లు ఖరారు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే టికెట్ల ఖరారు ప్రక్రియ షురూ చేసింది. ఇవాళ గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ వాడి వేడిగా జరిగింది.
దరఖాస్తు పరిశీలన కుదింపుపై కమిటీ సభ్యులు చర్చించారు. సెప్టెంబర్ తొలి వారంలో హైదరాబాద్‌కు స్క్రీనింగ్ కమిటీ రానుంది. అదే నెల మూడో వారంలో కాంగ్రెస్ జాబితా వస్తుంది. 119 స్థానాలకు గాను 1,025 దరఖాస్తులు వచ్చాయి. స్క్రీనింగ్ కమిటీకి ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లు ఇచ్చారు. కొడంగళ్, జగిత్యాలకు ఒకే దరఖాస్తు వచ్చింది. రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వామపక్షాల పొత్తులతో ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో టికెట్ల ఖరారుపై ప్రతిష్టంభన నెలకొంది.
ALso Read: కేసీఆర్ సీక్రెట్ సర్వే.. ఆందోళనలో టికెట్లు పొందిన అభ్యర్థులు.. ఆ స్థానాల్లో మార్పులు?
ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇంకా సర్వే దేశలోనే వుంది. 15 నుంచి 20 నియోజకవర్గాలకు సరైన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణలో బీజేపీది ఒంటరి పోరేనని స్పష్టమైంది. 119 స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా కిషన్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్ధుల ఖరారు కోసం ఎన్నికల కమిటీ వేసి.. ఆ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, అధ్యక్షుడి మార్పు తర్వాత తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. ఎప్పడేం జరుగుతుందోనన్న టెన్షనే అందుకు కారణం. అయితే త్వరలోనే పరిస్ధితులన్నీ చక్కబడతామని నేతలు కేడర్‌కు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి రానున్న రోజుల్లో వలసలు వుంటాయని ప్రచారం జరుగుతోంది. అప్పుడు బీజేపీ స్పీడ్‌తో ఆ పార్టీలో చేరిన కొందరు నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్న పుకార్లు లేకపోలేదు. ఈ పరిణామాలన్నింటిని వేగంగా తేరుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సవాల్ విసరాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో రానున్న నెలల్లో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
