హైదరాబాద్: గడువు పెంచాలని కోరుతూ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై ఏర్పాటు చేసిన కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో  న్యాయవాది పరమేశ్వర్ బుధవారం నాడు అప్లికేషన్ దాఖలు చేశాడు.

దేశ వ్యాప్తంగా  దిశపై రేప్ అత్యాచారం సంచలనం సృష్టించింది. దిశపై నవంబర్ 27వ తేదీన రాత్రి నలుగురు నిందితులు రేప్ చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను గత 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై 2019 డిసెంబర్ 12వ తేదీన ముగ్గురు సభ్యులతో  కమిషన్ ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు మాజీ జడ్డి వీఎస్ సిర్పూర్ కర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది.విచారణ కమిషన్ లో ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. 

త్రిసభ్య కమిషన్ కు సీఆర్ పీఎఫ్ భద్రత కల్పించారు. కమిషన్ ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ ను కోరింది.

కమిషన్ సభ్యులు గతంలో రాష్ట్రంలో పర్యటించి ఈ ఎన్ కౌంటర్ పై వివరాలను సేకరించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో విచారణ ముందుకు సాగలేదు. దీంతో మరో ఆరు మాసాల పాటు గడువును పొడిగించాలని న్యాయవాది పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో ధరఖాస్తు చేశాడు.