హైదరాబాద్:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు.... నిందితులు పారిపోతుంటే చేసిన ఎన్‌కౌంటర్ అని పోలీసులు నిరూపించుకోవాల్సిన అవసరం నెలకొంది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులపై ముఖ్యంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిశాయి. ఎన్‌కౌంటర్ స్థలంలోనే కొందరు పోలీసులపై పూలు చల్లి తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారంగా తమను తాము నిర్ధోషులుగా నిరూపించుకొనే ప్రక్రియలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి రావొచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. 

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాలు గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు

ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే సంబంధిత పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం హత్య నేరం కింద  కేసు నమోదు అవుతోంది. ఈ కేసు నుండి బయట పడేందుకు పోలీసులకు ప్రభుత్వం నుండి కానీ, పోలీసు శాఖ నుండి కానీ ఎలాంటి న్యాయ సహాయం అందదు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే లాయర్ల ఫీజు కూడ స్వంతంగా భరించాల్సి ఉంటుంది. 

ఈ తరహా ఘటనల్లో కొందరు పోలీసు అధికారులు తమ సర్వీసుల్లో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరైతే తాము రిటైరైన తర్వాత కూడ ఈ కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ తో పాటు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కూడ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడ పిటిషన్లు దాఖలయ్యాయి. 

సుప్రీంకోర్టులో ఈ నెల 11వ తేదీన విచారణ జరగనుంది.  ఈ నెల 12వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ చేయనుంది. అప్పటివరకు గాంధీ ఆసుపత్రిలోనే మృతదేహాలను భద్రపర్చారు.

ఈ తరహా కేసుల్లో పోలీసులు నిర్ధోషులుగా తేలే వరకు ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు బెనిఫిట్స్ దక్కవు. ఈ కేసులను పర్యవేక్షించే పోలీసులకు కూడ ఉద్యోగ విరమణ తర్వాత కూడ బెనిఫిట్స్ అందవు. జైలు శిక్షతో పాటు పదవీ విరమణ ప్రయోజనాల నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తీర్పులు కూడా వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రంలోని మందమర్రిలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఇన్స్‌పెక్టర్ నాలుగేళ్ల పాటు జీతం లేక తీవ్ర నరకాన్ని అనుభవించాడు. గుజరాత్ రాష్ట్రంలోని సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరుగురు పోలీసులు ఐదేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయమై తెలంగాణ పోలీసులను దేశ వ్యాప్తంగా అభినందించారు. అయితే ఈ కేసును జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. మూడు రోజులుగా జాతీయ మానవహక్కుల సంఘం ప్రతినిధులు ఈ ఎన్‌కౌంటర్ పై విచారణ చేస్తున్నారు.

ఈ తరహా ఎన్ కౌంటర్లను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రశ్నించేవారిని ఎన్‌కౌంటర్ల పేరుతో మట్టుబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రజా సంఘాలు తమ భయాన్ని లేవనెత్తాయి. దిశ గ్యాంగ్‌రేప్, హత్యను ఖండిస్తూనే ఈ ఎన్ కౌంటర్ ను కూడ కొందరు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఖండించాయి. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రేప్ కేసుల నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. నిర్భయ హత్య కేసు విషయంలో తాము చట్టబద్దంగా వ్యవహరించామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. 

తెలంగాణలోని హాజీపూర్ హత్యల కేసు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో ఆదీవాసీ మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన నిందితులను కూడ ఇదే తరహాలో శిక్షించాలనే డిమాండ్ తో నిరసనలు సాగుతున్నాయి.