మహిళా నిందితురాలి చెంప చెల్లుమనిపించిన పోలీసాయన మీద వేటు పడింది. ఈ దుష్ట ఘటనకు పాల్పడిన బేగంపేట ఎసిపి రంగారావును హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. మంగ అనే మహిళా నిందితురాలిని బొల్లారం పోలీసు స్టేషన్ లో బేగంపేట ఎసిపి రంగారావు చెంప పగలగొట్టారు. మీడియా ముందే చెంప చెల్లుమనిపించడమే కాకుండా గర్వం ప్రదర్శించాడు. దీంతో మీడియాలో రంగారావు చేసిన నిర్వాకం మారుమోగింది. సోషల్ మీడియా రంగారావుపై దుమ్మెత్తిపోసింది.

దీంతో తక్షణమే జరిగిన సంఘటనపై విచారణ జరపాల్సిందిగా సిటీ పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నార్త్ జోన్ డిసిపి సుమతి జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. దీంతో నిందితురాలైన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎసిపి రంగారావు మీద వేటు వేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది.

బేగంపేట ఎసిపి రంగారావును హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బేగంపేట ఎసిపి బాధ్యతలు నార్త్ జోన్ డిసిపి సుమతికి అప్పగించారు.

మొత్తానికి తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు అంటూ మాటలు చెప్పే పోలీసులు మీడియా ముందే మహిళ చెంప పగలగొట్టడం చూస్తే ఇదంతా ఉత్తుత్తి ఫ్రెండ్లీ పోలీసే అని జనాలు మండిపడుతున్నారు. మహిళా నిందితురాలి చెంప పగలగొట్టిన వీడియో కింద ఉంది చూడండి.