తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ షర్మిల గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కోమటిరెడ్డ్ికి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ కాంగ్రెసు ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనే విషయంపై రాజకీయ వర్గాల్లో ముమ్మరమైన చర్చ సాగుతోంది. ఆయన పార్టీలో కొనసాగడం సందేహంగానే ఉందని చెబుతున్నారు. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని చేసిన ప్రకటనతో ఆ అనుమానం వ్యక్తమవుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపిలో చేరుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, ఆయన పార్టీ నాయకత్వాన్ని ఆశిస్తున్నారే తప్ప ఓ నాయకుడిగా మాత్రమే ఉండడానికి ఇష్టపడడం లేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బిజెపి పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో ఆయన ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వైఎస్ షర్మిల తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివంగత నేత, వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని షర్మిల తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకులుగా వెలుగొందిన పురుషోత్తమ రెడ్డిని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని దెబ్బ తీసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రోత్సహించారనే మాట ప్రచారంలో ఉంది. వైఎస్ మంత్రివర్గంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేశారు. 

రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై కోమటిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. నిజానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలంగా పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.