Asianet News TeluguAsianet News Telugu

గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు మళ్లీ బ్రేక్...?

TET అర్హత ను ఎత్తివేయాలని అభ్యర్థులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. దీనిపై హైకోర్టు స్పందనను బట్టి గురుకుల నోటిఫికేషన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

dilemma on telangana gurukulam recruitment notification

తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న గురుకుల నోటిఫికేషన్ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కిలా తయారైంది.గతంలో సవాలక్ష షరతులు పెట్టి అభ్యర్థులకు చుక్కలు చూపెట్టిన గురుకుల నోటిఫికేషన్ సీఎం కేసీఆర్ ఆదేశంతో రద్దైంది. ఆ తర్వాత దాని ఉనికి కూడా కానరాకుండా పోయింది.

 

దీంతో నిరుద్యగ అభ్యర్థులు నిరసనలు, ధర్నాలకు దిగడంతో మళ్లీ హడావుడిగా నోటిఫికేషన్ వేశారు.గతంలో కాకుండా కొన్ని షరతులను సరళతరం చేస్తూ మళ్లీ ఈసారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో  అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ఉత్సాహంతో చదివేందుకు సిద్దమవుతున్నారు.

 

ఈ సమయంలో ఎన్ సీ టీ ఈ నిబంధన వారికి షాక్ ఇచ్చేలా తయారైంది. NCTE నిబంధనల ప్రకారం ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ )నిర్వహించాలి. కానీ, రాష్ట్రంలో టెట్ నిర్వహించక ఏడాది దాటింది.

 

అంటే ఇప్పటికే రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి. కానీ, ఆ పని చేయడంలో సర్కారు విఫలమైంది. దీని వల్ల కొత్తగా బీఎడ్ పూర్తి చేసుకున్నవారు టెట్ రాయలేకపోయారు. దీని వల్ల వాళ్లు గురుకుల పోస్టులకు అనర్హులయ్యారు.

 

అంతేకాదు గతంలో టెట్ లో క్వాలిఫై కాలేని వారు కూడా మళ్లీ టెట్ కోసం ఎదరుచూస్తున్నారు. రెండుసార్లు టెట్ నిర్వహించి ఉంటే వాళ్లలో కొందరైనా క్వాలిఫై అయి గురుకుల నోటిఫికేషన్ రాసేందుకు అర్హత సాధించేవారు. ఇలా మొత్తంగా చూసుకుంటే మరో లక్ష మంది టెట్ నిర్వహిస్తే గురుకుల నోటిఫికేషన్ కు అర్హత సాధించేవారు. కానీ, సర్కారు నిర్లక్ష్యం వల్ల అర్హత ఉన్న వాళ్లు గురుకుల పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది.

అందుకే ఇలా పరీక్షకు అర్హత సాధించలేని అభ్యర్థులు అప్పుడే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.TET నిర్వహించిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలి లేదంటే TET అర్హత ను ఎత్తివేయాలని అభ్యర్థులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది. దీనిపై హైకోర్టు స్పందనను బట్టి గురుకుల నోటిఫికేషన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios