హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి  మహాబూబ్ నగర్ సీటు ఇవ్వకూడదని మాజీ మంత్రి డీకె అరుణ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. మహాబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని  బీసీలకు కేటాయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. 

గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. మహాబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని తన కూతురుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతామన్నారు. టీఆర్ఎస్‌ ప్రజా వ్యతిరేకతను ఉపయోగించుకొనేందుకుగాను  కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పీడ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

పీసీసీ రేసులో  తాను ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనకు  మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి మధ్య  ఏజ్ గ్యాప్ ఉందన్నారు. అందుకే విబేధాలున్నాయని ఆమె చెప్పారు. టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి తనకు విబేధాలు లేవని చెప్పారు.

రాహుల్ గాంధీ హైద్రాబాద్‌కు వచ్చిన సమయంలో  నిర్వహించిన మహిళల సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే  ఎవరినీ సీఎం చేయాలనే విషయాన్ని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆమె చెప్పారు.