ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలయం కంపనీలకు చెందిన పైప్ లైన్ల నుండి భారీ ఎత్తున డిజిల్‌ను చోరీ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రహస్యంగా జరుగుతున్న ఈ చోరిని మల్కాజ్ గిరి, కీసర సిసిఎస్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ ముఠా గుట్టు రట్టు చేశారని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

 

డీజిల్ చోరికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిని నలుగురు నిందితులను ఇవాళ పోలీసులు మీడియా  ముందు ప్రవేశపెట్టారు. ఈ సంందర్భంగా కమీషనర్ ఈ చోరీకి  సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలకు చెందిన ఇందన కంపనీల నుండి  డీజిల్ చోరీ జరుగుతున్నట్లు  తమకు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందిందని కమీషనర్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన సీసీఎల్ పోలీసులు ఇలా చోరికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసేందుకు పథకం రచించారు. 

దీని ప్రకారం పైప్ లైన్ నుండి డీజిల్ ను ఎక్కడి నుండి తస్కరిస్తారో అక్కడ  కాపుకాశారు. ఈ సమయంలో మహారాష్ట్రకు చెందిన హఫీజ్ అజీజ్(42), మహబూబ్ నగర్ కు చెందిన శ్రీనివాసులు(32), బహదూర్ పురాకు చెందిన అబ్దుల్ జబ్బర్(25), వరంగల్ కు చెందిన జయకృష్ణ ఓ ట్యాంకర్ ను తీసుకుని చోరీకి వచ్చారు. దీంతో రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న పోలీసులు వీరి నుండి రూ.9,40,000 నగదు, డిజిల్ ట్యాంకర్, స్కార్పియో వాహనం, ఒక బైక్, సెల్ పోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 ఈ డిజిల్ చోరీ కేసులో మరో 8  మంది నిందితులు పరారీలో వున్నట్లు కమీషనర్ వెల్లడించారు. పట్టుబడిన నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్ల మహేష్ భగవత్ తెలిపారు.