తెలంగాణలోని పసుపు రైతలకు కేంద్ర ప్రభుత్వం అండగా వుంటామని హామీ ఇచ్చినట్లు బిజెపి నాయకులు ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అధికంగా పండించే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ పసుపు రైతులకు కూడా భోనస్ అందించాలని కోరారు. ఇందుకోసం ఇవాళ నిజామాబాద్ కు చెందిన బిజెపి నాయకులు, పసుపు రైతు నాయకులతో కలిన అర్వింద్ డిల్లీలో కేంద్ర మంత్రి, బిజెపి నాయకులు, అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

అర్వింద్ బృందం కేంద్ర హోంమంత్రి, బిజెపి మేనిపెస్టో కమిటీ ఛైర్మన్ రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వినయ్ కుమార్ లను కలిశారు. ఈ  సందర్భంగా వారికి రైతు సంఘాల నాయకులతో కలిసి అర్వింద్ పసుపు రైతుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

అనంతరం తెలంగాణ భవన్ లో ఈ పర్యటన గురించి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. చెరకు పంటకు మద్దతు ధర అందిస్తున్నట్లే పసుపు పంటకు కూడా మద్దతు కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర అందించాలని కోరినట్లు వెల్లడించారు. పసుపు మద్దతు ధర అంశాన్ని కూడా బిజెపి మేనిఫెస్టోలో చేర్చాలని కోరినట్లు తెలిపారు. తమ సమస్యలను సావధానంగా విన్న మంత్రి రాజ్ నాథ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా పసుపు రైతుల సమస్యలపై అద్యయనం చేసి వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేస్తామని హామీ ఇచ్చినట్లు అర్వింద్ వివరించారు. 

కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల ఆందోళన, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిపై పోలీసు చర్యకు దిగుతోందని అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ ఇలా రైతులపై అణచివేత ధోరణి ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అర్వింద్ తెలిపారు.