కేసీఆర్ కు మెలిక: ఫెడరల్ ఫ్రంట్ పై దేవెగౌడ వ్యాఖ్యలు ఇవీ...

Devegowda comments on federal front
Highlights

బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ కూటమి కట్టాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బెంగళూరు: బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ కూటమి కట్టాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు లేకుండా కూటమి సాధ్యం కాదనే అభిప్రాయం ప్రాంతీయ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. తాజాగా, జెడిఎస్ అధినేత దేవెగౌడ అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

తాము అన్ని పార్టీల నేతలను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని, అయితే వీరిలో బీజేపీని వ్యతిరేకించేవారు ఉన్నారు, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు ఉన్నారని, అందరి ఎజెండా మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 

రెండు పార్టీలను వ్యతిరేకించే నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలనుకుంటున్నాని దేవెగౌడ చెప్పారు. కుమారస్వామి ప్రమాణస్వీకార వేదిక బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తుందని ఆయన అన్నారు.
 
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాకపోయినా ఎక్కువ మొత్తంలో సీట్లు దక్కించుకుంటే అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి కాంగ్రెస్ మద్దతు అవసరం అవుతుందని అన్నారు.
 
ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ చేపట్టినా వారికి మద్దుతు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కుమారస్వామికి ఆ పదవి దక్కిందని ఆయన అన్నారు. 

కాంగ్రెసుతో కూటమి కట్టాలనేది తన నిర్ణయం కాదని, కుమారస్వామి నిర్ణయమేనని ఆయన అన్నారు. కాంగ్రెసుతో కలిసి వెళ్లాలని తాను కుమారస్వామికి చెప్పలేదని, ఆయనే ఆ నిర్ణయం తీసుకున్నారని దేవెగౌడ అన్నారు.

loader