హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో తెలంగాణ సర్కారు దిగొచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని ప్రకటించింది. 31 జల్లాల ప్రకారం ఇచ్చిన టిఆర్టీ నోటిఫికేషన్ ను సవరించి కొత్త నోటిఫికేషన్ 10 జిల్లాల ప్రాతిపదికన ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారులో చలనం వచ్చింది. ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అత్యవసరంగా విద్యాశాఖ అధికారులు, టిఎస్పిఎస్సీ అధికారులతో సమావేశమయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జరగనున్న భవిష్యత్తు పరిణామాలను చర్చించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పాత 10 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ సవరించి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

హైకోర్టు తీర్పుపై అవసరమైతే తదుపరి రివ్యూ పిటిషన్ వేయాలన్న ఆలోచన కూడా వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో నిరుద్యోగులు సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో రివ్యూ వేస్తే సమయం మరింత పెట్టే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. కాలయాపన అయితే నిరుద్యోగుల నుంచి ఆగ్రహజ్వాలలు మరింత పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళనలో ఉంది. అందుకే తక్షణమే హైకోర్టు డైరెక్షన్ మేరకు సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలన్న ఆలచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నిరుద్యోగుల నుంచి మరిన్ని డిమాండ్లు సర్కారు ముందుకు వస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన రీతిలో 15వేల ఖాళీ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలని టీచర్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 40 నెలలుగా కాలయాపన చేసి తీరా 15వేలు ఖాళీలు ఉన్నట్లు ఊరించి ఇప్పుడు మాత్రం 8వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అదికూడా వివాదాల్లో చిక్కేలా నిబంధనలు ఇవ్వడం పట్ల టీచర్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... సవరణ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచాని తెలంగాణ నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్ డిమాండ్ చేశారు. పోస్టుల సంఖ్య పెంపుదల కోసం ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. లక్షలాది మంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు సర్కారు పెద్దల మాయమాటలు విని వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలో డిఎస్సీ, అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ సర్కారు రోజుకో ప్రకటన చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. సవరణ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచకపోతే సర్కారుకు నిరుద్యోగ జెఎసి తడాఖా ఏంటో  చూపుతామని హెచ్చరించారు. ప్రకటనలతో నిరుద్యోగులను ఆశల పల్లకీలో ఊరేగించాలనుకుంటే ఈ సర్కారుకు త్వరలోనే సమాధి కడతామని హెచ్చరించారు.