మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. స్టార్ ఆస్పత్రి నిర్వాహకురాలు, దంత వైద్యురాలు డాక్టర్ శ్వేత(32) ఆత్మహత్య చేసుకున్నారు. తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల నాగయ్య, పుష్పలత దంపతుల కుమార్తె డాక్టర్ శ్వేతకు శాలీగౌరారం మండల కేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు బండారు కుమార్ తో 2009లో వివాహం జరిగింది. ఆయన స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. శ్వేత డాక్టర్స్ కాలనీలో స్టార్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

వీరికి తొమ్మిదేళ్ల వయసు కుమార్తె కూడా ఉంది.  పట్టణంలోని రెడ్డికాలనీలో వీరు అద్దెకు ఉంటున్న ప్లాట్ నుంచి బుధవారం ఉదయం భర్త ఆస్పత్రికి వెళ్లారు. కొంత సేపటి తర్వాత తాను బయట షాపింగ్ కు వెళ్తున్నాని చెప్పి.. కుమార్తెను పక్కింటికి పంపింది. మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి.

ఎంత పిలిచినా స్పందించించకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపుల పగలకొట్టి వెళ్లిచూశాడు. కాగా.. అప్నటికే శ్వేత చనిపోయి ఉంది. ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తమ అల్లుడే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించాడని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని  శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.