ఆదిభట్లలో యువతి కిడ్నాప్.. 100 మంది రౌడీలతో సినీ ఫక్కీలో దాడి, సామాన్లు ధ్వంసం
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని రాగన్న గూడలో వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. 100 మంది రౌడీలతో కలిసి నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని రాగన్న గూడలో వైశాలి అనే యువతి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. సుమారు 100 మంది రౌడీలతో కలిసి యువతిని కిడ్నాప్ చేశాడు టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి. యువతి వుంటోన్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. తల్లిదండ్రులకు పక్కింటి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిని పరిశీలించారు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని సిరి టౌన్‌షిప్‌లో సంఘటన జరిగింది. ముచ్చర్ల దామోదర్ రెడ్డి.. నిర్మల దంపతుల కుమార్తె వైశాలి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మాయి ఇంటిపై దాదాపుగా 100 మందికి పైగా యువకులతో దాడికి దిగాడు నవీన్ రెడ్డి. ఇంట్లోని సీసీ కెమెరాలు, సామాన్లు పూర్తిగా ధ్వంసం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు బంధువులపైనా దాడి చేశారు. గతంలో నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు . దాడి సమయంలో 100కి కాల్ చేసినా ఎవ్వరూ స్పందించలేదని అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు.
తమ కూతురిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పాడని, అతనితో మాట్లాడిన తర్వాత తాము పెళ్లికి అంగీకరించలేదని వైశాలి తల్లి అంటున్నారు. వైశాలి నిశ్చితార్థం జరిగే సమయంలో యువకులు దాడి చేశారు. తన కూతురి అపహరణపై వైశాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీన్ రెడ్డి టీ టైం యజమానిగా తెలుస్తోంది. దాడి చేసినవారిలో కొందరు హెల్మెట్లు ధరించి ఉన్నారని, కర్రలు తీసుకుని వచ్చారు. యాబై నుంచి వంద మందిదాకా వచ్చి వైశాలిని అపహరించారు. తనను తాకవద్దని వైశాలి చెప్పినా యువకులు వినలేదని ఆమె తల్లి చెప్పారు