Asianet News TeluguAsianet News Telugu

Dengue: తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Dengue cases: తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హైద‌రాబాద్ లోని  ఫీవర్ ఆసుపత్రిలో సెప్టెంబరు నెల‌లోనే దాదాపు 100 ధృవీకరించబడిన డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ లో ఈ నెలలోనే నలుగురు మరణించారు.  
 

Dengue : Dengue cases are increasing in Telangana
Author
First Published Sep 20, 2022, 1:25 PM IST

Hyderabad: తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప‌ట్ట‌ణాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెంగ్యూ కేసులతో పాటు సీజ‌నల్ వ్యాధులు పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఫీవ‌ర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఔట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య పెరుగుతున్న‌ద‌ని తెలిపారు. "పరీక్షలో దాదాపు 1,000 మందికి పైగా ఔట్ పేషెంట్లు ఉన్నారు. జలుబు దగ్గు, శరీర నొప్పులు, శరీరంలో కొన్ని భాగాల్లో  దద్దుర్లు వంటి లక్షణాలు కనుగొనబడ్డాయి" అని ఆయన తెలిపారు. ఇంకా డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. గత నెలలో రాష్ట్రంలో సుమారు 80 కేసులు నమోదయ్యాయి. అయితే సెప్టెంబర్‌లో ఫీవర్ ఆసుపత్రిలో సుమారు 100 ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, చికెన్ గున్యా, డిఫ్తీరియా కేసులు  కూడా పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే తాము రోగుల‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. రిక‌వ‌రీ రేటు సైతం ఇప్ప‌టివ‌ర‌కు మెరుగ్గానే ఉంద‌ని చెప్పారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అయితే కేసుల తీవ్రత తక్కువగా ఉందని రిపోర్టుల ద్వారా వెల్ల‌డైంద‌న్నారు. డెంగ్యూ తో పాటు టైఫాయిడ్, కామెర్లు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. అలాగే, సీజనల్ ఫ్లూ ఎక్కువగా ఉంద‌ని చెప్పారు. “తెలంగాణ ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. సిబ్బంది అందరినీ అప్రమత్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతోంది కానీ ఆందోళనకరంగా లేదు” అని ఆయన అన్నారు. గత రెండు నెలల్లో దాదాపు 200 డెంగ్యూ కేసులకు చికిత్స అందించామనీ, అయితే ఎవరికీ ప్లేట్‌లెట్ అవసరం కాలేదని ఆయన అన్నారు. 99 శాతం మంది రోగులకు తొంద‌ర‌గానే కోలుకుంటున్నార‌ని తెలిపారు.

ఉమ్మ‌డి నిజామాబాద్ లోనూ.. 

వర్షాభావంతో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. జిల్లా ఆరోగ్య అధికారుల ప్రకారం ప్రతి రోజు 40-50 వ‌ర‌కు సంబంధిత ల‌క్ష‌ణాల కేసులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన భరత్‌రెడ్డి (22) అనే విద్యార్థి డెంగ్యూతో సెప్టెంబర్ 17న మృతి చెందడంతో భయాందోళనలు వ్యాపించాయి. ఆర్మీలో పనిచేస్తున్న బీటెక్ విద్యార్థి భరత్‌రెడ్డి తండ్రి రాజేశ్వర్‌రెడ్డి తన కొడుకును చికిత్స కోసం సికింద్రాబాద్‌లో  ఉన్న సైనిక ఆసుపత్రి చేర్పించారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం భరత్‌రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించగా డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు.

వర్షాల నేపథ్యంలో కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించాయి. ఈ వ్యాధితో తొమ్మిది మంది మరణించగా, ఈ నెలలో నలుగురు మరణించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్ర‌యివేటు ఆసుపత్రులు డెంగ్యూ రోగులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు రోజూ 40 నుంచి 50 మంది రోగులు వస్తుంటార‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. "వీరిలో కనీసం ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ [ICU]లో చేర్చారు. మిగిలిన వారు ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయబడుతున్నార‌ని కామారెడ్డి జిల్లా ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. "డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. దోమలను నిర్మూలించడమే ఏకైక నివారణ. ఇది ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న మలేరియా, చికున్‌గున్యా ఇన్‌ఫెక్షన్. దోమ‌ల నివార‌ణ , శుభ్ర‌త అవ‌స‌రం" అని అధికారి తెలిపారు. గత ఏడాది కామారెడ్డి జిల్లాలో 44 డెంగీ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 26 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని లక్ష్మణ్ సింగ్ తెలిపారు. మాచారెడ్డిలో నెల రోజుల క్రితం డెంగ్యూతో కళాశాలలో చదువుతున్న బాలిక మృతి చెందినట్లు తెలిపారు. మలేరియా కొంతమేర అదుపులో ఉన్నప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios