Asianet News TeluguAsianet News Telugu

కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు మార్కెట్ కూల్చివేత చేపట్టారు. 

demolition of gaddiannaram fruit market at kothapet
Author
Hyderabad, First Published Mar 8, 2022, 10:22 AM IST

కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు మార్కెట్ కూల్చివేత చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలను వ్యాపారులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ అధికారులు, వ్యాపారుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. 

ఇక, ప్రభుత్వం గడ్డిఅన్నారం వ్యవసాయ, పండ్ల మర్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్‌ పార్కులోకి తరలించిన సంగతి తెలిసిందే. ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చూస్తుంది. అయితే ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై కొందరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. మార్కెట్‌లో ఉన్న ఫర్నీచర్, ఏసీ సామగ్రి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే బాటసింగారం మార్కెట్​ లో తగిన సదుపాయాలు కల్పించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. బాటసింగారం తాత్కాలిక మార్కెట్ కు వెళ్లేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. గత కొంతకాలంగా ఈ వివాదం కొనసాగుతుంది.

అయితే ఇటీవల హైకోర్టు.. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మార్కెట్ లో ఉన్న సామాగ్రి తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలని హైకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios