సెక్రెటేరియట్ లను కూల్చేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిపాదనను అడ్డుకట్ట వేయాలని  తెలంగాణా కాంగ్రెస్ గవర్నర్ ను కోరింది.

 తెలంగాణా సచివాలయం భవనాల కూల్చివేసే పంచాయతీని తెలంగాణా కాంగ్రెస్  ఈ రోజు రాజ్ భవన్ కు తీసుకువెళ్లింది.

 

ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టి.కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు గవర్నర్ ఇఎస్  ఎల్  నరసింహన్ ను కలిశారు. ప్రజల భారం మీద మోపే ఈ కూల్చివేత ప్రతిపాదనను నిలుపుదల చేసేందుకు  కెసిఆర్ సర్కార్ కు  ఆదేశాలివ్వాలని  పిసిసి అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కె. జనారెడ్డి నేతృత్వంలో రాజ్ భవన్ వెళ్లిన కాంగ్రెస్ బృందం కోరింది.

 

వాస్తు పేరుతో భవనాలు కూల్చివేయడం సరైన చర్య కాదని చెబుతూ దీనివల్ల రు.350 కోట్ల ప్రజాధానం వృథా అవుతుందని వారు చెప్పారు. ఈ మేరకు ఒక వినతపత్రం కూడా సమర్పించారు.

 

 కూల్చాలనుకుంటున్నభవనాలలో కొన్ని చాలా కొత్తవని,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత నెలవరకు పని చేస్తూ వచ్చిన ఎల్ బ్లాక్ ను  ఈ మధ్యే రు. 30 కోట్లు ఖర్చు చేసి అధునాతనం చేసిన సంగతి ని కూడా వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
 

తర్వాత విలేకరులతో మాట్లాడుతూ వాస్తు సాకుతో  భవనాలు కూల్చడాన్ని తాము వ్యతిరేకిస్తామని  ఈ చర్యకునిలిపి వేసేదాకా  ఉద్యమిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ హెచ్చరించారు.

కాంగ్రెస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనను ఇప్పటికే కోర్టులో సవాల్ చేశారు.