హరీష్ తో కాంగ్రెస్ సంపత్ భేటీ

First Published 29, Nov 2017, 12:13 PM IST
Delhi sensation Congress MLA Sampath meets with TRS minister Harish In Delhi
Highlights
  • అరగంటపాటు మంతనాలు
  • రాజకీయవర్గాల్లో సంచలనం
  • ఆపరేషన్ ఆకర్ష్ ఉందా  అన్న చర్చలు

తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనకుండా ఢిల్లీలో మకాం వేసిన హరీష్ రావు ఏం చేస్తున్నాడన్న ఆసక్తి తెలుగు ప్రజల్లో నెలకొంది. ఆయన తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చే పనిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఢిల్లీ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఢిల్లీ పరిణామాలపై మరిన్ని వివరాలు చదువుదాం.

మంత్రి హరీష్ రావు గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న మంత్రి హరీష్ రావును బుధవారం ఉదయం అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెలంగాణ భవన్ లో వీరిద్దరూ కలిశారు. ఇద్దరూ సుమారు అరగంట పాటు సమావేశమయినట్లు తెలిసింది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం తెల్లారుగట్ల అలంపూర్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ ఢిల్లీకి వెళ్లిపోయారు.

హరీష్, సంపత్ భేటీ మాత్రం కీలక పరిణామాలకు వేదిక కానుందా అన్న ఆసక్తిని రేపుతున్నది. ఎందుకంటే హరీష్ రావుతో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. గతకొంతకాలంగా సంపత్ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఎపిసోడ్ కు ముగింపు పలికేందుకు టిఆర్ఎస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులంతా పాల్గొన్నారు. హరీష్ రావు, చందూలాల్ తప్ప. తుదకు స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ లాంటి పెద్దలు కూడా పాల్గొన్నారు. చందులాల్ విషయం పక్కన పెడితే హరీష్ ఎటు పోయిండబ్బా అని సర్వత్రా చర్చ జరిగింది. ఆయన ఢిల్లీలో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా చర్చలు ఆగలేదు. ఆయన ఇంతటి కీలక సమయంలో ఢిల్లీకి ఎందుకు పోయినట్లు అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో జనాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.

ఇక గత కొంతకాలంగా తెలంగాణ పిసిసి మీద, సిఎల్పీ మీద సంపత్ ఆగ్రహంగా ఉన్నారు. వారిద్దరూ యువతను ఎంకరేజ్ చేయడంలేదన్న విమర్శలు చేశారు. తాను తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా మీడియాకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో సంపత్ ఢిల్లీలో హరీష్ రావును కలవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరదుకున్నాయి.

టిఆర్ఎస్ లోకి వెళ్లే చాన్సే లేదు : సంపత్

ఢిల్లీ భేటీ విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఏషియానెట్ తో మాట్లాడారు. ఆయన ఏషియా నెట్ కు చెప్పిన విషయాలివి.. నేను ఏఐసిసి పెద్దలను కలిసే పని మీద ఢిల్లీకి వచ్చిన. అక్కడ తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు ఉన్నారు.. ఎంతైనా మంత్రి కదా? అందుకే మాట్లాడిన. అరగంటసేపు మీటింగ్ అంటే... చాలా విషయాలు చర్చకొచ్చినయ్. రాజకీయాల్లో సహజం కదా? టిఆర్ఎస్ లో చేరే ప్రశ్నే లేదు. హరీష్ రావును కలిసిన మాట నిజం. కానీ టిఆర్ఎస్ లో చేరే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఏమైనా రాయదలుచుకుంటే రాయొచ్చు... అంటూ సంపత్ వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా హరీష్ రావు ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో ఆసక్తిని రేపుతున్నది.

loader