ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. నాలుగున్నర గంటలుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. నాలుగున్నర గంటలుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. అయితే మధ్యలో కవితకు ఈడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఈడీ కార్యాలయం ప్రాంగణంలో కవిత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే కవితను ఈ రోజు ఎంతసేపు విచారిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతుంది. మహిళా అధికారి సమక్షంలోనే కవిత విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్ గురించిన వివరాలను ఈడీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైలతో పాటు సౌత్ గ్రూప్‌కు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కవిత వినియోగించిన ఫోన్లకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం.
అయితే ఈరోజు విచారణలో కవితను ప్రాథమిక అంశాలపై ఈడీ విచారిస్తున్నట్టుగానే తెలుస్తోంది. ఈరోజు విచారణ తర్వాత కవితను పంపిస్తారని.. మరోసారి ఆమెను ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈరోజు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో.. ఏం జరగబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఇక, కవితకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి చేరుకన్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఢిల్లీకి చేరుకుని కవితకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ రోజు ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ ఆఫీసుకు బయలుదేరిన సమయంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కవిత బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు ఈడీ నోటీసులను రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కామెంట్ చేశారు.
