Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ సర్కారుకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • చిటికెలో లక్షలు సంపాదించిన గులాబీ కూలీలకు గుబులు తప్పదా?
  • రేవంత్ రెడ్డి పిటీష‌న్‌పై జాతీయ‌ స్థాయిలో చ‌ల‌నం
  • కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఢిల్లీహైకోర్టు ఆదేశం
Delhi High Court ask Election commission  to take view on Gulabi coolie

గత నాలుగేళ్ల టిఆర్ఎస్ పాలనలో సర్కారు అనేక సందర్భాల్లో కోర్టు మొట్టికాయలు తిన్న ఉదంతాలున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు హైకోర్టులోనే సర్కారుకు వ్యతిరేకంగా ఆదేశాలు వెలువడ్డాయి. టీచర్ ఉద్యోగాల నియామకాల వంటి కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టులో సైతం తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బలు తప్పలేదు. కానీ అనూహ్యంగా ఈసారి ఢిల్లీ హైకోర్టు తెలంగాణ సర్కారుకు షాక్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వేసిన ఒక పిటిషన్ తెలంగాణ సర్కారుకు ఆందోళన కలిగించేలా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరి ఆ ఇష్యూ తాలూకు పూర్తి వివరాలు కింద చదువురి.

గులాబి కూలీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గతంలో భారీగా నిధుల సమీక‌ర‌ణ‌ చేపట్టింది. అప్పుడు చేసిన వ్య‌వ‌హారం ఇప్పుడు ఆ పార్టీలో గుబులు రేపుతున్నది. నిధుల స‌మీక‌ర‌ణ  పేరుతో  రాజ‌కీయ‌ పార్టీలు అనుస‌రించే విధానాలు చ‌ట్టాల‌లోని లోపాల‌ను ప్ర‌తిఫ‌లిస్తోంద‌నిఢిల్లీ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. గులాబి కూలీ వ్య‌వ‌హారంపై రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో గతంలోనే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది.

గ‌తఏడాది ఏప్రిల్ నెల‌లో వ‌రంగ‌ల్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాల‌ను నిర్వ‌హించిన సంద‌ర్భంగా తొవ్వ‌ ఖ‌ర్చుల కోస‌మంటూ రాష్ట్ర‌మంత్రులు గులాబీ కూలీ పేరిట ఉత్తుత్తి కూలి ప‌నులు చేయ‌డం, కొన్ని నిమిషాల‌ పాటు తాము చేసిన పనుల‌కు ప్ర‌తిఫ‌లంగా ల‌క్ష‌లాది రూపాయ‌లు వ‌సూలు చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. దీనిలో భాగంగానే...

కేటీఆర్ ఐస్‌క్రీం అమ్మి రూ.7ల‌క్ష‌లు,

పోచారంశ్రీ‌నివాస్ రెడ్డి జిన్నింగ్‌ మిల్లులో రూ.8.50 లక్ష‌లు, 

హ‌రీష్‌రావు రైస్‌మిల్లులో ప‌ని చేసి రూ.6.27ల‌క్ష‌లు,

నాయ‌ని న‌ర్సింహారెడ్డి బ‌ట్ట‌ల‌షాపులో, అక్కడ ఇక్కడ పని చేసి రూ.20.52 ల‌క్ష‌లు,

ప‌ద్మారావు చేప‌లు అమ్మి రూ.38.50 ల‌క్ష‌లు 

ఈటెల రాజేంద‌ర్ రైస్‌మిల్లులో మూట‌లు మోసి రూ.11 ల‌క్ష‌లు

మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూరు న‌ర్స‌రీలో ప‌ని చేసి రూ.10ల‌క్ష‌లు, 

ల‌క్ష్మారెడ్డి  య‌శోదాఆ స్ప‌త్రిలో వైద్యుడిగా బీపీ చెక్‌ చేసి రూ.5ల‌క్ష‌లు,ఇత‌ర చోట్ల‌లో కూడా ప‌నిచేసి రూ.16 ల‌క్ష‌లు,

త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ స్వీట్‌స్టాల్‌లో మిఠాయిలు అమ్మి రూ.18.50 ల‌క్ష‌లు సంపాదించారు.

ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులంద‌రూ గులాబీ కూలీ పేరిట ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు కూడా ప‌ని చేయ‌కుండానే ల‌క్ష‌లాది రుపాయ‌లు బ‌హిరంగంగా వ‌సూలు చేయ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ  ఢిల్లీ  హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీష‌న్ ను దాఖ‌లు చేసారు.

ప్ర‌జాప్ర‌తినిధులుగా ప్ర‌భుత్వం నుంచి వేత‌నాలు తీసుకుంటున్నవారు లాభ‌దాయ‌క‌మైన ఇత‌ర ప‌నులు చేయ‌డం, విలువైన కానుక‌ల‌ను స్వీక‌రించ‌డం కూడా అవినీతి నిరోధ‌కచ‌ట్టం 1988, ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 1951కి వ్య‌తిరేక‌మ‌ని, అలాంట‌ప్పుడు బాధ్య‌తాయుత‌మైన మంత్రి ప‌ద‌వుల్లోఉన్న‌వారు బ‌హిరంగంగా కూలీ పేరిట కోట్లరుపాయ‌లు వ‌సూలు చేయ‌డం అవినీతే అవుతుంద‌ని అందుకే ఈ అంశాన్ని విచారించి త‌గిన‌ ఆదేశాలివ్వాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను ప్ర‌తివాదిగా చేసి రేవంత్ న్యాయ‌స్థానాన్నిఆశ్ర‌యించారు. ఈ అంశాన్ని విచారించిన కోర్టు ఈ వ్య‌వ‌హారం  రాజ‌కీయ‌పార్టీల నిధుల స‌మీక‌ర‌ణ‌కు అనుస‌రిస్తున్న విధానాల‌ను తెలుపుతోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. రాజ‌కీయ‌ పార్టీల నిధుల స‌మీక‌ర‌ణ‌కు సంబంధించి ఇదివ‌ర‌కే చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ ఇలాంటి విధానాల‌ను రాజ‌కీయ‌పార్టీలు అనుస‌రిస్తున్నాయంటే ఆ చ‌ట్టాల‌లో ఉన్న లోపాల‌పై దృష్టి సారించాల‌ని ఎన్నిక‌లక‌మిష‌న్‌ను కోర్టు ఆదేశించింది. అలాగే రేవంత్ రెడ్డి లేవ‌నెత్తిన అంశాల‌ను కూడా ప‌రిశీలించి వాటిపై ఒక అభిప్రాయానికి రావాల‌ని కూడా న్యాయ‌స్థానం ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను ఆదేశించింది.

అప్పట్లో గులాబీ కూలి పనుల్లో భాగంగా సిఎం కేసిఆర్ కూడా తట్ట మోస్తా కూలి సంపాదించి సభకు పోతా అని ప్రకటన చేశారు. హెలిక్యాప్టర్ లో వెళ్లి సిఎం కేసిఆర్ కూలి పని చేస్తారని టిఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో తన మంత్రి వర్గ సహచరులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కూలి పనులు చేశారు. సిఎం కేసిఆర్ మాత్రం కూలి పనులు చేయాలనుకున్నా.. చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు తాలూకు ఈనెల 19న ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మరోసారి గులాబీ కూలి సంపాదన వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

ఢిల్లీ హైకోర్టు వెలువరించిన 2పేజీల ఆర్డర్ కాపీ కింద ఉంది చదవొచ్చు.

Delhi High Court ask Election commission  to take view on Gulabi coolie

 

Delhi High Court ask Election commission  to take view on Gulabi coolie

Follow Us:
Download App:
  • android
  • ios