డిగ్రీ విద్యార్థినిపై ప్రగతి రిసార్ట్ లో ప్రేమోన్మాది లైంగిక దాడి, హత్య

Degree girl student killed by jilted lover
Highlights

 రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని ప్రగతి రిసార్ట్ లో దారుణ సంఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి యత్నించి, హత్య చేశాడు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని ప్రగతి రిసార్ట్ లో దారుణ సంఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి యత్నించి, హత్య చేశాడు. సాయి ప్రసాద్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ డిగ్రీ విద్యార్థిని శిరీషను ప్రగతి రిసార్ట్ కు తీసుకుని వెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు.

శిరీష గొంతు కోసి అతను హత్య చేశాడు. సాయిప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాట్లాడుకుందాం రమ్మని చెప్పి శిరీషను  సాయిప్రసాద్ రిసార్ట్ కు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని అతను అడిగితే ఆమె తిరస్కరించిందని సమాచారం. దాంతో అతను లైంగిక దాడికి యత్నించాడని, ఆమె ప్రతిఘటించడంతో కోపంతో హత్య చేశాడని అంటున్నారు. 

ప్రేమ పేరుతో కొంత కాలంగా అతను శిరీషను వేధిస్తున్నట్లు, ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడంతో ఆగ్రహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే తన కూతురిని సాయిప్రసాద్ వేధించాడని, అప్పుడు మందలించామని, దాంతో దూరంగా ఉంటూ వచ్చాడని శిరీష తండ్రి ఈశ్వర్ చెప్పాడు. 

కోచింగ్ సెంటర్ కు వెళ్లిన శిరీషను సాయి ప్రసాద్ పిలుచుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు చెబుతున్నారు. రిసార్ట్ లో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్నారు.

మామూలుగా సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తుందని, అయితే కూతరు రాకపోవడంతో తన భార్య శిరీష ఫోన్ కు కాల్ చేస్తే ఎత్తలేదని, దాంతో తన భార్య తనకు ఫోన్ చేసి విషయం చెప్పిందని, తాను రెండు సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదని, మూడో సారి సిఐ ఎత్తాడని, తనను వెంటనే రావాలని చెప్పాడని ఈశ్వర్ వివరించారు. కూతురి హత్యకు ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు.

loader