కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుబడ్డ వారిని వందే భారత్ మిషన్ ద్వారా భారతదేశానికి తిరిగి తీసుకొస్తున్న విషయం తెలిసిందే! హైదరాబాద్ కి వచ్చినవారంతా 14 రోజులపాటు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందే అన్న నియమాన్ని తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. ఈ క్వారంటైన్ అంతా కూడా పెయిడ్ క్వారంటైన్. వచ్చిన వారంతా తమ సొంత డబ్బును చెల్లించి ఈ క్వారంటైన్ కేంద్రాలలో ఉండాలి. 

ఇలా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఒక గర్భవతి మహిళ, ఆమెతో పాటు మరో మహిళ, ఇద్దరు మహిళలు కూడా కట్టడానికి డబ్బులు లేక హోటల్ లాబీలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న హైదరాబాద్ కి చెందిన ఒక జంట కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా... ఉదయం నాలుగు గంటలకు హోటల్ కి చేరుకొని వారి క్వారంటైన్ కాలానికి డబ్బును కట్టేసి వెళ్లిపోయారు. 

ఎంబిటి పార్టీ నాయకుడు అంజాద్ ఉల్లా ఖాన్ ఇలా మహిళలకు కట్టడానికి డబ్బు లేదు అన్న విషయాన్నీ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న రాజేంద్ర అగర్వాల్ దంపతులు హుటాహుటిన అక్కడకు చేరుకొని హోటల్ వారిని కనుక్కొని ఇద్దరికి కలిపి రూమ్ షేరింగ్ లో 22,500 రూపాయలను కట్టేసి వెళ్ళిపోయారు. 

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళడానికి నిద్ర లేచిన రాజేంద్ర అగర్వాల్ ఈ మెసేజ్ ని చూసి మిన్నకుండలేకపోయాడు. తన భార్యతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. 

కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియొద్దు అన్నట్టుగా హోటల్ వారితో ఇద్దరు మహిళలకు సంబంధించిన డబ్బును కట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అంతే తప్ప ఆ మహిళలను కలవడం కానీ, వారితో మాట్లాడడం కానీ చేయకుండా, తమ బాధ్యత ఇక్కడి వరకే, తాము ఏమి ఆశించడంలేదని చెప్పి వెళ్లిపోయింది ఆ జంట.