హైదరాబాద్: కిడ్నాప్ కు గురైన వివాహిత దీపిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. రెండు రోజులుగా దీపిక ఆచూకీ ఇంకా దొరకలేదు. 

వికారాబాద్ లో షాపింగ్ కు వచ్చిన దీపికను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఈ నెల 27వ తేదీన కిడ్నాప్ చేశారు. దీపికతో పాటు ఉన్న సోదరిని కిడ్నాపర్లు పక్కకు తోసేసి ఆమెను ఎత్తుకెళ్లారు.

దీపికను కిడ్నాప్ చేసిన కారు ఆమె భర్త అఖిల్ ది గా పోలీసులు గుర్తించారు. స్విఫ్ట్ కారులో దీపికను కిడ్నాప్ చేసినట్టుగా దీపిక సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కారు నెంబర్ ను గుర్తించి కారు ఎవరిదనే విషయాన్ని తేల్చారు.

2016లో అఖిల్ ను ప్రేమించి దీపిక పెళ్లి చేసుకొంది. పెళ్లైన నెల రోజులకే ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. గత రెండేళ్లుగా దీపిక తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అఖిల్ నుండి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 26 వ తేదీన అఖిల్, దీపికలు విడాకుల కేసు విషయమై కోర్టుకు హాజరయ్యారు. కోర్టు కేసుకు హాజరైన మరునాటి సాయంత్రమే ఆమె కిడ్నాప్ కు గురికావడం సంచలనం కల్గిస్తోంది.

దీపికను అఖిల్ కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.అఖిల్ తల్లిదండ్రులను  పోలీసులు విచారిస్తున్నారు. దీపిక కోసం ఏడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అఖిల్ సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్  చేసి ఉంది.

వికారాబాద్  నుండి 40 కి.మీ వెళ్తే కర్ణాటక లేదా మహారాష్ట్రలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కర్ణాటకకు తీసుకెళ్లారా...మహారాష్ట్రకు తీసుకెళ్లారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.