తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ లో పాల్గొన్న కేటీఆర్.. ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ రావడంతో ఉద్రిక్తత..
2009, నవంబర్ 29.. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో... కెసిఆర్ సచ్చుడో...’ అని నినదిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజన్నారు కేటీఆర్.
హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీక్షా దివస్ చేయవద్దని ఎన్నికల అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘిస్తూ దిక్షాదివస్ చేపట్టారని ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్ కు చేరుకుంది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా, మంగళవారం నాడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం నవంబర్ 29న దీక్ష దివస్ స్ఫూర్తిగా పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. 2009, నవంబర్ 29 తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో... కెసిఆర్ సచ్చుడో...’ అని నినదిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠం దిగొచ్చేందుకు నాంది పలికారని ఇందులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాడు దీక్షా దివస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్ కు చేరుకుంది.