జగిత్యాల జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. చనిపోయిందనుకుని మహిళకు అంత్యక్రియలు చేస్తుండగా ఓ మహిళకు ఒక్కసారిగా శ్వాస వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సారాంగపూర్ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళకు ప్రమాదవశాత్తు తలకు గాయమైంది.

దీంతో కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స  పొందుతుండగానే ఆమె కన్నుమూసింది. దీంతో కనకమ్మ మరణాన్ని తట్టుకోలేక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆమె మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే కనకమ్మ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.

ఆమె బతికే ఉందని గుర్తించి ఆనందంతో వెంటనే జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు. కాగా కనకమ్మకు ముందుగా వైద్యం అందించిన ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే కనకమ్మ చనిపోయిందని అనుకున్నామని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.