తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే కన్నుమూసిన ఓ చిన్నారి.. కేసుని కీలక మలుపుతిప్పింది. అత్యాచారం కేసులో నిందితుడికి శిక్షపడేలా చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కి చెందిన 26ఏళ్ల  యువకుడు.. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు  చెప్పి.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసే నాటికి.. ఆ బాలిక ఆరు నెలల గర్భవతి.

వెంటనే ఆ యువకుడి వద్దకు బాలిక తల్లిదండ్రులు వెళ్లి.. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు. అయితే.. అందుకు అతను నిరాకరించాడు. తమ ఇద్దరి కులాలు వేరని.. అసలు.. బాలిక కడుపుకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

కాగా.. ఈ క్రమంలో బాలికకు నెలలు నిండకుండానే డెలివరీ జరిగింది. ఆడ బిడ్డ జన్మించగా.. పుట్టిన కొన్ని గంటలకే ఆ పసికందు కన్నుమూసింది. కాగా.. పోలీసులు తెలివిగా ఆ చిన్నారి డీఎన్ఏ ని సేకరించి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2015లో జరిగింది.

కాగా.. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. చిన్నారి డీన్ఏ ఆధారంగా మైనర్ బాలికను రేప్ చేశాడని కోర్టు ధ్రువీకరించింది. నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది.