డీఏవీ స్కూల్ నే రీ ఓపెన్ చేయాలి.. మా పిల్లల్ని వేరే స్కూల్స్ కు పంపం.. తల్లిదండ్రుల అల్టిమేటం...
డీఏవీ పబ్లిక్ స్కూల్ ను రీఓపెన్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మేనేజ్మెంట్ మార్చి ఇదే స్కూల్ ను కంటిన్యూ చేయాలని.. పిల్లల్ని వేరే స్కూళ్లకు పంపించవద్దని కోరుతున్నారు.
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిఏవి పబ్లిక్ స్కూల్ ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్కు వద్ద డి ఏవి స్కూల్ కు చెందిన సుమారు 200మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదని అన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహతుకు మించిన వ్యవహారం అవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రులు అభిప్రాయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
సీబీఎస్ఈ స్కూల్ లో సర్దుబాటు చేస్తాం…
బంజారాహిల్స్ లోని డిఏవి విద్యార్థులను సీబీఎస్ఈ స్కూల్ లోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రగులుకుంది. ఈ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
స్కూల్ రీఓపెన్ చేసే ప్రసక్తే లేదు.. డీఏవీ పాఠశాల మేనేజ్‌మెంట్‌కు తేల్చిచెప్పిన తెలంగాణ విద్యాశాఖ
కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాల మూసివేత, ఇతర పాఠశాలల్లో సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్కూల్స్ మేనేజ్మెంట్ తో సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఆయా స్కూల్ లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అంటున్నారు. వారి అభీష్టం మేరకు ఆయా స్కూల్లో చేర్పించచే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ డీఈవో రోహిణి స్పష్టం చేశారు.
మంత్రికి కృతజ్ఞతలు...
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా బాధలు వింటూ తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ ఇక్కడే రీ ఓపెన్ చేయాలని కోరుతున్నామని ఓ పేరెంట్ తెలిపాడు. అలా కాకుండా వేరే స్కూల్లో చేరిస్తే చాలా సమస్యలు వస్తాయని.. అక్కడి వాతావరణం అలవాటు పడటం మరింత కష్టమవుతుందని... ఆన్ లైన్ క్లాసులకు మేము ఒప్పుకోమంటూ మరో తల్లి చెప్పుకొచ్చింది. ఇంకొక పేరెంట్ మాట్లాడుతూ పిల్లలు మరో పాఠశాలకు వెళ్లడం కుదరదు. అడ్మిషన్లు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అంత ఫీజులు చెల్లించుకోలేం. కొత్త మేనేజ్ మెంట్ తో డీఏవీ స్కూల్ నే కొనసాగించాలని అన్నారు.