మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త కోసం ఓ మహిళ తన తల్లితో కలిసి దారుణానికి పాల్పడింది. మరో నెలరోజుల్లో పదవీ విరమణ పొందనున్న తండ్రిని అతి దారుణంగా చంపింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో మహేందర్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

మహేందర్ తన ఏకైక కూతురికి ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాడు. అయితే తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆ కన్న కూతురు దారుణానికి పాల్పడింది. దీనికి మహేందర్ భార్య కూడా సహకరించడం మరీ దారుణం.  

వచ్చే నెల 30 న మహేందర్ ఉద్యోగ విరమణ పొందనున్నాడు. అయితే అంతకు ముందే అతడు చనిపోతే ఆ ఉద్యోగం కారుణ్య నియామకం కింద భర్తీ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కూతురు తన తన భర్తకు ఆ ఉద్యోగాన్ని ఇప్పించాలని ఈ హత్యకు పాల్పడింది. తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా తల్లితో కలిసి బండరాయితో అతడి తలపై మోది హత్య చేశారు. అనంతరం అతడి మృతిని సహజ మరణంగా సృష్టించే ప్రయత్నం చేశారు.  

అయితే ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్న అతడు హటాత్తుగా మరణించడంతో అనుమారం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహేందర్ కుటుంబ సభ్యులను విచారించగా అసలు నిజం బైటపడింది. భర్తకు సింగరేణి ఉద్యోగం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితురాలు, అతడి తల్లి పోలీసుల ఎదుట వెల్లడించారు. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.