హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణం జరిగింది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అల్లుడిపై దాడి చేసి కూతురిని కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా రామన్నగూడెంకు చెందిన పల్లపు రాజు నిజాం కాలేజీలో డిగ్రీ చదవేటప్పుడు తన సహా విద్యార్ధిని, ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌లోని నివసిస్తున్న బిందుతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.

వీరిద్దరు జూలై 15వ తేదీన నిజామాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. అంతేకాకుండా తమ కూతురు కనిపించడం లేదని తల్లీదండ్రులు ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో రాజు, బిందు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము మేజర్లమని, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పారు. తాము పెళ్లి చేసుకోవడం బిందు కుటుంబసభ్యులకు ఇష్టం లేక... తమపై దాడికి యత్నిస్తున్నారని... తన భార్యను తీసుకెళ్లాలనుకుంటున్నారని, రక్షణ కల్పించాలని రాజు విజ్ఞప్తి చేశాడు.

పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి రాజీ చేశారు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆగ్రహంతో రగిలిపోతున్న బిందు తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం 15 మందితో కలిసి అంబర్‌పేటలో ఉంటున్న రాజు ఇంటికెళ్లారు.

బిందును బలవంతంగా తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.. అడ్డుకున్న రాజుపై కత్తులతో దాడి చేసి, కూతురిని తీసుకెళ్లారు. తన భార్యను కిడ్నాప్ చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.