హైదరాబాద్: డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు నేరుగా ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు నోటీసులు జారీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. దర్యాప్తులో తేలిన సంచల విషయాల నేపథ్యంలోనే వారు ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన వివరాలు నేరుగా లోకేష్ కార్యాలయం నుంచి హైదరాబాదులోని ఐటి గ్రిడ్ సంస్థకు చేరినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారు రాబట్టారని అంటున్నారు. 

ఆ సంస్థ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, ఐటి గ్రిడ్ సంస్థ అధిపతి అశోక్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. తన అరెస్టు తప్పదనే ఉద్దేశంతో అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉడాయించినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేశారని తెలిసిన వెంటనే గత నెల 27వ తేదీన అతను పారిపోయినట్లు చెబుతున్నారు. 

అశోక్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. లొంగిపోవడానికి అశోక్ కు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో కోర్టు వారంట్ తో అశోక్ ను అరెస్టు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 

అశోక్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు భావిస్తున్నారు. అశోక్ ను విచారిస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. డాటా ఎవరి ద్వారా ఐటి గ్రిడ్ కు అందింది, ఎవరు వివరాలను తీసుకోమన్నారు, ఆ డేటాతో ఏం చేయాలని అనుకున్నారు వంటి ప్రశ్నలకు అశోక్ ద్వారా సమాధానాలు రాబట్టాల్సి ఉందని అంటున్నారు. 

ఎపి ప్రభుత్వం అశోక్ కు రక్షణ కల్పిస్తోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా నారా లోకేష్ కే నోటీసులు జారీ చేస్తే తప్ప కేసు కొలిక్కి రాదనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐటి గ్రిడ్ అధిపతి అశోక్ 3 హార్డ్ డిస్క్ లతో హైదరాబాదు విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ హార్డ్ డిస్క్ లను తీసుకుని వెళ్లడంతో పాటు ముఖ్యమైన కొన్ని వివరాలను డీలిట్ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. దీంతో తాము స్వాధీనం చేసుకున్న వాటి నుంచి సమాచారాన్ని తిరిగి పొందేందుకు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.