జోగు రామన్న ను రబ్బర్ స్టాంప్ చేశావు

Dasoju fumes at KCR for making bc minister Jogu Ramanna a rubber stamp
Highlights

  • బిసిలకు కేబినెట్ లో ఎన్ని బెర్తులు ఇచ్చావు
  • బిసిలను మోసం చేయడానికే కొత్త డ్రామా
  • బిసిని టిఆర్ఎస్ అధ్యక్షుడిగా చేయగలవా?

తెలంగాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న కేబినెట్ లో రబ్బరు స్టాంప్ గానే మిగిలిపోయిండని విమర్శించారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసిఆర్ సర్కారు బిసి నేతల మీటింగ్ పెట్టడంపై మండిపడ్డారు. ఆయన ఏం మట్లాడారో చదవండి.

బీసీ ల స్థితిగతుల పై అభివృద్ధి పై మాట్లాడే ఈవెంట్ కు సీఎం కెసిఆర్ తెరతీశారు. బీసీ లకు కావాల్సింది విద్య, వైద్యం,ఉపాధితో పాటు రాజ్యాధికారంలో సమతుల్యత. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందే ఎస్సీ, ఎస్టీ, బిసిల సామజిక ఉద్యమంతోనే.

ఒక బీసీ ని టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసే సత్తా కేసిఆర్ కు ఉందా? బీసీ లకు దామాష పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలని అంటున్నారు. ముందు మీ పార్టీలో ఎంతమంది బీసీ లకు సీట్లు కేటాయించారో సమాధానం చెప్పు. అట్లాగే వచ్చే ఎన్నికల్లో బీసీ లకు టిఆర్ఎస్ పార్టీ 50శాతం సీట్లు కేటాయిస్తుందా? సమాధానం చెప్పాలి.

జాతి సంపద సృష్టించేది బీసీ లే...అందుకే బీసీలకు సంపదలో వాటా కల్పించాలి. బీసీ మంత్రి జోగి రామన్న ను రబ్బర్ స్టాంప్ చేశారు. బీసీ లకు ఏటా 5వేలు ఖర్చు పెడతామని గడిచిన మూడేళ్లలో 6వేల 720 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. బీసీ లకు సబ్ ప్లాన్ పెడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. బీసీ ఫెడరేషన్ లకు ఎంగిలి మెతుకులు వేసినట్లు నిధులు విడుదల చేస్తున్నారు.

ఎంబీసీ చైర్మెన్ ను ఉత్సవ విగ్రహంగా పెట్టారు. అతడికి ఓ టేబుల్ లేదు, కుర్చీ లేదు. సర్కారుకు దమ్ముంటే భూమి లేని నిరుపేద బిసిలకు మూడెకరాల భూమి ఇవ్వాలి. ఫీ రీయంబర్స్ మెంట్స్ రాదని ఆశ కోల్పోయి 80 వేల మంది బీసీ విద్యార్థులు అప్లయ్ చేసుకోలేదు. మాకు గొర్లు, బర్లు ఇచ్చి మీరు ఆధిపత్య పదవులు తీసుకుంటున్నారు. 75 శాతం మంది రైతులు బీసీ లే. బీసీ రైతుల పట్ల ప్రేముంటే బ్యాంకర్లను పిలిచి వడ్డీ మాఫీ చేయాలి.

ప్రాజెక్టుల కాంట్రాక్టులు పెద్దోళ్ళకు ఇచ్చి...మోరీలు కట్టే కాంట్రాక్టు లు బీసీ లకు ఇస్తారా? రాష్ట్రంలో ఎంత మంది బీసీ లు కీలక శాఖల్లో ఉన్నారు? మసిపూసి మాయ చేసేందుకు బీసీల విగ్రహాలు పెడతామంతున్నారు. చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్య విగ్రహాలు పెట్టకుండా మూడేళ్ళుగా కెసిఆర్ ను ఎవరు అడ్డుకున్నారు ?

కెసిఆర్ ఓట్ల బిచ్చగాడిగా మారిండు. ఈ మూడేళ్లు బీసీలకు చేసిందేమిటి ? కెసిఆర్ తన కేబినెట్లో బిసిలకు ఎందుకు అవకాశం ఇవ్వరు ,,ఇచ్చిన వాటా ఎంత ? కేసీఆర్ ,,బీసీలకు  ,తీర్మానాలు ,చర్చలు కాదు చట్ట సభల్లో వాటా ఇవ్వాలి. బిసి సబ్ ప్లాన్ ను మూడేళ్ళుగా పక్కన పెట్టింది కేసీఆర్ కాదా ?

బీసీ అభివృద్ధి పై చర్చ అంటూ కేసీఆర్ మూడురోజుల గా డ్రామా చేస్తున్నారు. ముందు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ)లో బీసీలు ఎంత మంది ఉన్నారో చెప్పండి. వచ్చే ఎన్నికల్లో యాభై శాతం సీట్లు ఇస్తామని ప్రకటించి కేసీఆర్ చిత్తశుద్ధి చాటుకోవాలి.

loader