మంత్రి హరీష్ ఆఫర్ రిజెక్ట్ చేసిన మెదక్ లీడర్

damodara Raja Narsimha rejects Harish Rao's offer
Highlights

షాకింగ్ న్యూస్..

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఆఫర్ ను ఆయన రిజెక్ట్ చేశారు. అంతేకాదు ఆ ఆఫర్ తనకు ఏమాత్రం సమ్మతం కాదన్నారు. ఒకరిని బాధపెడుతూ ఆ ఆఫర్ నాకు ఇస్తే ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. ఇంతకూ ఎవరాయన? ఆ ముచ్చటేందని అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

రైతు బంధు పేరుతో తెలంగాణ సర్కారు రైతులకు ఎకరాకు 4వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఆ దిశగా కార్యాచరణ వేగవంతమైంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ తన తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమికి ఇచ్చే రైతు బంధు చెక్కును తీసుకోబోనని స్పష్టం చేశారు. గౌరవంగానే ఆ చెక్కును తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

సింగూరు పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ తల్లి జానాబాయి పేరు మీద ఉన్న 20 ఎకరాల భూమికి కూడా రైతు బంధు పథకం కింద లక్షా 60వేల రూపాయలను ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఇలాంటి పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.

అయితే మంత్రి ఆఫర్ ను దామోదర తిరస్కరించారు. దానికి కూడా బలమైన కారణం చూపారు దామోదర రాజనర్సింహ్మ. తెలంగాణ రాష్ట్రంలో 60, 70 శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. వారిని కేసిఆర్ సర్కారు పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఏమాత్రం మేలు చేయడంలేదన్నారు. కేవలం బడా రైతుల గురించి మాత్రమే సర్కారు ఆలోచిస్తున్నదని విమర్శించారు.

చిన్న, సన్నకారు రైతులను అన్యాయం చేస్తున్నది కాబట్టే తాను రైతు బంధు చెక్ ను తిసర్కరించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. తెలంగాణ సర్కారు తీరుతోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ హత్య చేసుకున్న రైతుకుటుంబాలను ఏమేరకు ఆదుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు దామోదర రాజనర్సింహ్మ.

loader