మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక...షాకింగ్ విషయాలు...
బ్యారేజ్ ఫౌండేషన్ కు వాడిన మెటీరియల్ లో నాణ్యత లేకపోవడమే కుంగుబాటుకు కారణం అని తెలిపింది.
హైదరాబాద్ : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిమీద విచారణ చేపట్టిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తన నివేదికను శుక్రవారం సమర్పించింది. బ్యారెజ్ పునాదుల కింద ఇసుక కుంగిపోవడం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని తేల్చింది. బ్యారేజ్ కుంగిపోవడానికి గల అనేక కారణాలను తమ నివేదికలో పొందుపరిచింది.
బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే కుంగిపోయినట్లుగా నివేదికలో తెలిపింది. బ్యారేజ్ ఫౌండేషన్కు వాడిన మెటీరియల్ లో నాణ్యత లేదని చెప్పుకొచ్చింది. బ్యారేజీ లోడ్ వల్ల ఇసుక మీద ఉన్న కంకర కూడా కొట్టుకుపోయిందని.. దీనివల్ల పిల్లర్లు బలహీనపడ్డాయని తెలిపారు.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని కేంద్రానికి తెలిపింది. కమిటీ కోరిన డేటాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కమిటీ 20 అంశాల్లో ప్రశ్నిస్తే 11 అంశాలకు మాత్రమే డేటా ఇచ్చారని నివేదికలో తెలిపింది.
బ్యారేజ్ ను తేలియాడే నిర్మాణంగా నిర్మించారని, మరమ్మత్తులు పూర్తయ్యేదాకా ప్రాజెక్టులో నీళ్లు నిలుపకూడదని తెలిపింది. బ్యారేజ్ నిర్మాణ సమయంలో అవసరమైన, అధ్యయనాలు పరీక్షలు జరగలేదని తెలిపింది. మేడిగడ్డతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించాలని నివేదికలో పేర్కొంది. కృంగిపోయిన బ్యారేజీని పునరుద్దించే వరకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.