Dalith Bandhu: దళిత బంధు డౌటేనా? లబ్దిదారుల ఆందోళనలు
దళిత బంధు డౌటేనా? అనే అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత బంధు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. దీంతో ఈ పథకం కోసం ప్రయత్నాలు చేసినవారు.. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నవారిలో ఆందోళనలు నెలకొన్నాయి. నల్లగొండలో ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్దిదారులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు.
Dalith Bandhu: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని తెచ్చింది. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం అందించే ఈ పథకం కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయ పైరవీలు పెద్దపెట్టున జరిగాయి. కొందరికి ఈ నిధులు అందాయి. కానీ, చాలా మంది పైరవీలు చేసి, లంచాలు ఇచ్చుకుని నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరికైతే ప్రొసీడింగ్స్ కాపీ కూడా వచ్చాయి. కానీ, ఎన్నికల కోడ్‌తో ఆ నిధులకు బ్రేకులు పడ్డాయి. కోడ్ ముగిసింది. కానీ, దళిత బంధు ఊసే లేకుండా పోయింది. తమ వంతు ‘కృషి’ పూర్తై.. ప్రభుత్వం వైపు ప్రాసెస్ పెండింగ్‌లో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి ఘటనే నల్లగొండ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దళిత బంధు పథకం యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు సాధన కమిటీ నాయకులు కలెక్టరేట్ వద్ద ప్రొసీడింగ్ కాపీలు పొందిన లబ్దిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు వినతి పత్రం అందించారు.
Also Read: Rythu Bandhu: రైతు బంధు కింద ఆ రైతన్న ఖాతాలో రూ. 1 జమ.. కలవరంలో రైతు
దళిత బంధు పథకం రెండో విడతలో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో 1055 మంది లబ్దిదారులను ఎంపిక చేశారని సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు ఎంపిక చేశారని, మున్సిపల్ వార్డుల్లో సభల ద్వారా అర్హులను ఎంపిక చేసినట్టు వారు వివరించారు. వీరికి అక్టోబర్ 8వ తేదీన జిల్లా కేంద్రంలో ప్రొసీడింగ్ కాపీలను కూడా అందించారని తెలిపారు.