హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి వెంట  నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలను మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురు  తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఓ రిసార్టులో పనిచేయడానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుండి కొందరు మహిళలు వలస వచ్చారు. వీరంతా శామీర్ పేట సమీపంలోని తూకుంట గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా రోజు ఉదయం రిసార్టుకు రాజీవ్ రహదారి వెంట నడుచేకుంటూ వెళ్లి సాయంత్రం తిరిగివచ్చేవారు. 

ఇలా  ఆదివారం కూడా అందరూ కలిసి రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో వెనుకనుండి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో అందరికి తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీబాయి, పూనమ్ అనే ఇద్దరు కూలీలు మృతిచెందారు. అలాగే గాయత్రి, నాగలక్ష్మి, రామలక్ష్మి, గుండ్లూరి రాధమ్మలు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.