వైఎస్ వివేకాందన మృతితో తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉదయం వైఎస్ వివేకా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. అది హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీనిపై డీ శ్రీనివాసరావు  స్పందించారు.

‘వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయన ఒక మంచి రాజకీయవేత్త. వివేకానందరెడ్డి మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఆకాంక్షించారు. అలాగే మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు  మాట్లాడుతూ... వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఓ నిజాయితీ గల నాయకుడిని ప్రజలు కోల్పోయారని అన్నారు.

వివేకా మృతిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా స్పందించారు.  వివేకానంద రెడ్డి మృతి బాధాకరమని..ఆయనతో కలిసి తాము పనిచేశామని గుర్తు చేసుకున్నారు. వివేకా చాలా సౌమ్యుడని.. వివాదాలకు అతీతంగా వ్యవహరించేవారన్నారు. దిగజారిన సంస్కృతికి వివేకానందరెడ్డి అతీతుడన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.