Asianet News TeluguAsianet News Telugu

మాండౌస్ తుఫాను ప్రభావం: హైదరాబాద్ స‌హా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం

Hyderabad: మాండౌస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ స‌హా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక ప్రకారం, తుఫాను వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది.
 

Cyclone Mandous effect: Light rain in several parts of the state, including Hyderabad
Author
First Published Dec 10, 2022, 12:55 AM IST

Cyclone Mandous effect: బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మాండౌస్ తుఫాను  ప్రభావంతో హైద‌రాబాద్ స‌హా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం మేఘావృత‌మైంది క‌నిపించింది. డిసెంబర్ 10-12 మధ్య హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, మాండౌస్ తుఫాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు వాయువ్య దిశగా పయనిస్తోంది. ప్ర‌స్తుతం శేరిలింగంపల్లి, చార్మినార్, రామచంద్రపురం సహా ప్రాంతాల్లో స్వల్పంగా చినుకులు పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఎల్‌బీ నగర్, హయత్‌నగర్, అంబర్‌పేట్, ఉప్పల్, అల్వాల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలు సైతం తేలికపాటి వర్షాల‌ను చూస్తాయ‌ని ఐఎండీ పేర్కొంది. 

హైదరాబాద్‌లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. సికింద్రాబాద్‌లో అత్యల్పంగా 12.4 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్ (12.6 డిగ్రీల సెల్సియస్), రామచంద్రపురం, పటాన్‌చెరు (12.8 డిగ్రీల సెల్సియస్)లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చందానగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, ఎల్‌బీ నగర్, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కామారెడ్డిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి (6.6 డిగ్రీల సెల్సియస్), ఆదిలాబాద్ (7.0 డిగ్రీల సెల్సియస్), మెదక్ (8.0 డిగ్రీల సెల్సియస్) నమోదయ్యాయి.

రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, శనివారం నల్గొండలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. రాష్ట్రంలో చ‌లి తీవ్రత సైతం క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఇండ్ల‌లోప‌లే ఉండవలసి వచ్చింది. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బేల, బజార్‌హత్‌నూర్‌ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌, 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తలమడుగు, జైనైత్, ఆదిలాబాద్ రూరల్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్, ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, గాదిగూడ మండలాల్లో 7.8 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పాఠశాలలకు సెలవులు.. 

మాండౌస్ తుఫానుతో తమిళనాడు వణికిపోతోంది. తుఫాను ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో దీనిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. చెన్నై, విల్లుపురం, కడలూరు , కాంచీపురంలోని అన్ని పాఠశాలలు,కళాశాలలను మూసివేయాలని ఆదేశించారు. డిసెంబర్ 9న చెన్నై విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. ఈ సమాచారాన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. రద్దు చేసిన విమానాల జాబితాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ షేర్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios