Asianet News TeluguAsianet News Telugu

Cyclone Gulab: భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం... నీటమునిగిన తీర ఆలయాలు, పంటలు (వీడియో)

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో తీరప్రాంత పొలాలు, ఆలయాలు నీట మునిగాయి. 

Cyclone Gulab... Flood Water Flow Increased in Godavari River due to heavy rains in telangana
Author
Jagtial, First Published Sep 28, 2021, 5:18 PM IST

జగిత్యాల: గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలకు నదులు, వాగులు వంకలు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీరు చేరడంతో జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ వర్షాలతో గోదావరి నదికూడా ఉగ్రరూపం దాల్చింది.  

జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కరఘాట్లను ముంచెత్తిన గోదావరి జలాలు సంతోషిమాత ఆలయంలోకి ప్రవేశించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భక్తులు వెళ్ళకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 

ఇక గోదావరి వరద ఉధృతి పంటలను కూడా ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ధర్మపురి మండలం జైనా గ్రామంలోని గోదావరి నది తీరంవెంట రైతుల పొలాల్లోకి నీరు చేరింది. ఈ వరద నీటిలో వరి పొలాలు మునిగిపోయాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

వీడియో

ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం వద్దగల శ్రీపాద ఎల్లంపల్లి పాజెక్టు నిండు కుండలా మారింది. 40 గేట్లు ఎత్తి 39,0080 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవటంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలాశయంలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఎగువ నుంచి 43,2163 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తోంది.   

read more  Cyclone gulab:మూసీ నదిలో కొట్టుకుపోయిన మృతదేహం

ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.45 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు నదీ తీరం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకోసారి సైరన్ మోగిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.

కాళేశ్వరంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ కు వరద ఉద్రుతి పెరిగింది. దీంతో బ్యారేజ్ 74 గేట్లలో 66 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,89600 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో కూడా 3,89600 క్యూసెక్కులుగా వుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios