పోలీస్ శాఖపై ఇష్టారీతిన వస్తున్న కామెంట్స్‌పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు, డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తే కేసులు ఎదుర్కోకతప్పదని ఆయన హెచ్చరించారు.

కాగా, తెలంగాణ పోలీసులపై రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలీసుల తీరుపై తెలంగాణ డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి మహారాష్ట్ర నుంచి 45 ఆవులతో శంషాబాద్ మీదుగా వెళ్తున్న లారీని చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.