మధ్యప్రదేశ్‌కు చెందిన కరడుగట్టిన దొంగల ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకోసం ఆర్నెళ్లపాటు కార్మికులుగా పనిచేసి వారిని అరెస్ట్ చేశారు. వీరిపై 100కు పైగా కేసులు నమోదైనట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. 

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ‘ఖాకీ’ సినిమా చూశారా. అందులో దోపిడీలు, హత్యలు చేసే ముఠా సభ్యులను పట్టుకునేందుకు కార్తి అండ్ టీమ్ రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి వెళ్తారు. అక్కడి గ్రామస్థులు నిందితులకు మద్దతుగా నిలిచి పోలీసులపైనే దాడికి పాల్పడతారు. దొరికిన వారిని విచక్షణా రహితంగా కొట్టి ఊరి నుంచి తరిమేస్తారు. అచ్చుగుద్ది నట్లు ఆ సినిమా తరహాలోనే ఆపరేషన్ చేసి కరడుగట్టిన దొంగల ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు.

ఆర్నెళ్లపాటు మధ్యప్రదేశ్‌లో సైబరాబాద్ పోలీసులు అండర్‌గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందుకోసం రోడ్డు కార్మికులుగా పనిచేశారు సైబరాబాద్ పోలీసులు. తెలంగాణలో 100కు పైగా చోరీలు చేసిన ఈ దొంగల కోసం పోలీసులు ఆపరేషన్ చేశారు. దాదాపు ఆర్నెళ్ల పాటు పడిన శ్రమకు ఫలితం దక్కింది. మొత్తం 11 మంది కరడుగట్టిన దొంగలను పట్టుకున్నారు పోలీసులు. దార్ నుంచి వివిధ మార్గాల్లో తెలంగాణకు వచ్చి చోరీలు చేస్తోంది ఈ ముఠా. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులకు చిక్కలేదు దొంగలు. 

ALso Read:అచ్చం ‘ఖాకీ’ సినిమానే: రాజస్థాన్‌లో ఏపీ పోలీసులపై దాడి

దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. అరెస్ట్‌ చేసిన వారు 98 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. వీరిపై సైబరాబాద్‌లో 68, నిజామాబాద్‌లో 10, కరీంనగర్‌లో 02, వరంగల్‌లో 06, జగిత్యాలలో 09, కామారెడ్డిలో 02, సిద్దిపేటలో ఒక కేసు నమోదైందని కమీషనర్ వివరించారు. ఈ 11 మంది ముఠాగా ఏర్పడి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ కట్టర్స్, రాడ్స్, స్క్రూ డ్రైవర్స్‌తో వీళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న సీపీ వివరించారు. ఈ ముఠాలో మరికొందరు ఉన్నారని.. వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు.