రాజస్తాన్‌లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
రాజస్తాన్‌లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంతపెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు రికవరీ చేయడం ఇదే మొదటిసారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా నిందితులు అమాయకులను మోసం చేశారని చెప్పారు. పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో కోట్ల రపాయలు కొల్లగొట్టారని తెలిపారు.
మార్కెట్ బాక్స్ యాప్‌ను సెబీలో రిజిస్టర్ చేయలేదని తెలిపారు. మార్కెట్ బాక్స్ యాప్‌లో 3వేల మంది సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు.పెట్టుబడులకు రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మించి డబ్బులు కాజేశారని తెలిపారు. 10 మంది సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులను అభిషేక్ జైన్, పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్, కృష్ణకుమార్‌లుగా గుర్తించినట్టుగా చెప్పారు. నిందితుల నుంచి రూ. 9.81 కోట్లు స్వాధీనం చేసుకన్నట్టుగా తెలిపారు. అభిషేక్ జైన్ యాప్‌ను డిజైన్ చేశారని చెప్పారు.
ఫోన్, మెయిల్స్‌కు వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. రెట్టింపు లాభాల అని చెబితే నమ్మవద్దని.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
