తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర సాంకేతిక సలహా మండలి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చింది. ఇవాళ ఢిల్లీలో సీడబ్ల్యూసీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతుల గురించి చర్చకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌‌కు అవసరమైన ప్రధానమైన పర్యావరణ, అటవీ అనుమతులతో పాటు మిగిలిన సాంకేతికపరమైన అనుమతులకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌‌‌‌కు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడం పట్ల వారిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ సాగునీటి రంగానికి కీలకమైన కాళేశ్వరం విషయంలో అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.