కమీషన్ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రూ. 1000, రూ. 500 తీసుకుని అవసరాన్ని బట్టి 10-20 శాతం మధ్యలో కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్నే ఇస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దుతో చిల్లరమాలక్ష్మి కోసం కష్టాలు మొదలయ్యాయి. మంగళవారం వరకూ చిన్న నోట్లను అంటే, 100, 50, 20, 10 రూపాయలను పెద్దగా పట్టించుకోని జనం మంగళవారం రాత్రినుండి ఒక్కసారిగా చిల్లరమాలక్ష్మి వెంట పడ్డారు. కారణం..రూ. 1000, రూ. 500లను రద్దు చేయటమే. మంగళవారం అర్ధరాత్రి నుండి పై నోట్లను రద్దు చేస్తున్నట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. సమయం గడిచే కొద్దీ అప్పటి వరకూ ఎంతో ఘనంగా చూసుకుంటున్న పెద్ద నోట్లు ఇక చెల్లవన్న విషయాన్ని జీర్ణించుకోలేని పలువురు చిల్లర నోట్ల గురించి ఆలోచించటం మొదలుపెట్టారు.

ఇళ్ళలో ఎంత వెతికినా అవసరాలకు సరిపడా చిల్లర నోట్లు కనబడక, పెద్ద నోట్లు చెల్లక ప్రజలు పడిన ఇబ్బందులు చూడాల్సిందే. పలువురికి దాదాపు గుండె ఆగిపోయినంత పనైందంటే అతిశయోక్తి కాదేమో. పెద్ద నోట్ల రద్దు గురించి దేశవ్యాప్తంగా ప్రచారం శరవేగంగా మొదలైందో అప్పటి నుండి ప్రజలు ముందుగా పెట్రోలు బంకుల వద్దకు క్యూ కట్టారు. అక్కడ కూడా అందరికీ చుక్కెదురైంది. దాంతో ఇక జనాల టెన్షన్ అంతా ఇంతా కాదు. ఏటిఎంల్లో చిన్ననోట్లు అయిపోయో లేక ఏటిఎంలు పనిచేయటం ఆగిపోయి, అప్పటికే ఏటిఎంలు పనిచేయటం లేదన్న బోర్డులు చూసిన ప్రజల్లో టెన్షన్ గంటగంటకు పెరిగిపోయింది.

రాత్రి ఎలాగో గడచినా బుధవారం ఉదయం నుండి అసలు సమస్యలు మొదలయ్యాయి. కూరలు, పాలవాళ్ళు, ఊర్లకు బయలుదేరాల్సిన వారు ఇలా ఎందరో చేతిలో సరిపడా చిల్లర లేక పడుతున్న అవస్తలు వర్ణణాతీతం. ప్రయాణ సమయాల్లో సరిపడా చిల్లర లేకపోవటంతో బస్సుల్లొను, రైళ్లలోనూ ప్రయాణీకులకు టిక్కెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. పెట్రోలు బంకుల్లో కూడా సరిపడా చిల్లర ఉంటేనే పెట్రోలు పోస్తున్నారు. చాలా పెట్రోలు బంకులు మూతేసారు. ఒకవేళ కొన్ని బంకుల్లో సరిపడా చిల్లర లేకున్నా రూ. 1000, రూ. 500 తీసుకుంటున్నా పెట్రోలు పోయించున్న మొత్తం పోగా మిగిలిన డబ్బులకు చీటీలు ఇస్తున్నారు బస్సుల్లో కండక్టర్లు ఇచ్చే విధంగా. ఇష్టపడిన వారికి పెట్రోలు పోస్తున్నారు లేదంటే సరిపడా చిల్లర ఉంటేనే పోస్తున్నారు.

ఇక, టోల్ ప్లాజాల్లో కూడా చిల్లర లేదన్న కారణంగా వందలాది వాహనాలు బారులు తీరుతున్నాయి. బస్సులు, కార్లు, మోటారు బైకులు తదితర వాహనాలకు సరిపడా చిల్లర ఉంటేనే టోల్ ప్లాజాల్లో టోల్ కట్టించుకుంటున్నారు. లేదంటే నిర్మొహమాటంగా వాహనాలను పక్కన బెట్టేస్తున్నారు. దాంతో వేలాది వాహనాలు ఆగిపోతున్నాయి. పరిస్థతిని గమనించిన ప్రభుత్వం టోల్ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా టోల్ నిర్వాహకులు అనుమతించటం లేదు. ఇక పరిస్ధితులను అవకాశంగా తీసుకునే దళారాలీ రంగం ప్రవేశం చేసారు. ఇదే అదునుగా కమీషన్ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రూ. 1000, రూ. 500 తీసుకుని అవసరాన్ని బట్టి 10-20 శాతం మధ్యలో కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్నే ఇస్తున్నారు.