తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణాల గోల్మాల్ కలకలం రేపుతోంది. రూ.రెండు కోట్ల అక్రమాలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, ఓ కారు డ్రైవరు కలిసి వంట రుణాల్లో గోల్మాల్ చేశారు, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇందుకు వేదికైంది.

రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ పాస్ పుస్తకాలు, సొంతంగా తయారు చేయించిన స్టాంపులతో డ్రైవరు కథంతా నడిపించగా, బ్యాంకు మేనేజర్లు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కమీషన్ల కోసం రెండు కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చేశారు.

 ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్ ఫిబ్రవరి 3న ఈ అక్రమాలను గుర్తించారు. పోలీసులు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా ఐదుగురు పరారీలో ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శుక్రవారం సి పి సత్యనారాయణ ఈ వివరాలు వెల్లడించారు. 

2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్ కారు డ్రైవర్ గా పని చేసిన ప్రభాకర్ పంట రుణాలు తీసుకోవడానికి ఏ పత్రాలు అవసరమో అవగాహన పెంచుకున్నాడు. ముత్తారం మండలం గ్రామానికి చెందిన అతడు పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించాడు. 

ముత్తారం తహసిల్దార్ కార్యాలయం ముందు జిరాక్స్ సెంటర్ నడిపే కుక్కడపు అశోక్ ను సంప్రదించాడు. రబ్బరు స్టాంపుల కోసం పెద్దపల్లి శ్రీ రాజరాజేశ్వర రబ్బర్ స్టాంప్స్  దుకాణం నడిపే బ్రహ్మండ్లపల్లి సుధాకర్ ను కలిశాడు. అతని వద్ద ఆర్డిఓ, డిప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్, విఆర్వో స్టాంపులు తయారు చేయించాడు. పట్టా పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కోసం ఆర్డీవో కారు డ్రైవర్గా పనిచేస్తున్న సదానందం తో చేతులు కలిపాడు.

ప్రభాకర్ ముత్తారం రామగిరి మండలాల్లో తనకు తెలిసిన వారికి పంట రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. తర్వాత ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని ప్రచారం చేశాడు. మొత్తం 153 మందికి ఇలా అప్పులు ఇప్పించాడు. ఒక్కో రుణానికి రూ. 5000 కమిషన్ ఇస్తానని చెప్పి బ్యాంకు మేనేజర్లుగా పని చేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లుతో బేరం కుదుర్చుకున్నాడు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే ఒక్కొక్కరికి లక్ష రూపాయల రుణం ఇచ్చారు. 

ప్రభాకర్ కు సహకరించి రుణాలు ఇప్పించి రవీందర్, శ్రీనివాస్, ప్రవీణ్, అనిల్ కుమార్, సత్యనారాయణ, భూమయ్య, సదానందం, అశోక్, సదన్న, శివ కుమార్, రాజేందర్ లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. 

నాటి బ్యాంకు మేనేజర్లు రామానుజాచార్య, వెంకటేశ్వర్లు సహా ఐదుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ 5,55000 నగదు, నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు తదితరమైన స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.