తెలంగాణలో వర్షాలు : చెరువులోకి కొట్టుకొచ్చిన మొసలి, స్థానికులు షాక్.. బంధించిన అధికారులు
వరంగల్ జిల్లాలో మూడు గంటల పాటు శ్రమించిన అధికారులు ఓ మొసలిని పట్టుకుని దానిని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని పాకల్ సరస్సులో వదిలిపెట్టారు. శుక్రవారం హన్మకొండలోని పద్మాక్షీగుట్ట వద్ద ఓ ఫ్లాటులోని వరద నీటిలో మొసలి కనిపించింది.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై, జనావాసాలు నీట మునుగుతున్నాయి. అయితే వరద నీటితో పాటు విషపూరితమైన పాములు, తేళ్లు వస్తున్నాయి. వీటితో పాటు భారీ మొసళ్లు సైతం ఇళ్లలోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో మూడు గంటల పాటు శ్రమించిన అధికారులు ఓ మొసలిని పట్టుకుని దానిని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని పాకల్ సరస్సులో వదిలిపెట్టారు.
శుక్రవారం హన్మకొండలోని పద్మాక్షీగుట్ట వద్ద ఓ ఫ్లాటులోని వరద నీటిలో మొసలి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అటవీ శాఖ , పశువైద్య నిపుణులకు సమాచారం అందించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన ఈ బృందం మొసలిని రక్షించి దానిని పాకల్ సరస్సులో విడిచిపెట్టారు. అయితే మొసలి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై వివరాలు తెలియాల్సి వుంది.
కాకతీయ జూ పార్క్ సమీపంలోని ఓ కాలనీ నివాసితులు గతంలో పద్మకాశిగుట్ట వద్ద చెరువులో మొసలిని గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మొసలిని గుర్తించేందుకు సిబ్బంది ఎన్నిసార్లు యత్నించినా దాని ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అటవీ సిబ్బంది మొసలిని రక్షించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.