వివేక్ పై వేటు సరైనదే, ఎట్టకేలకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచింది : అజారుద్దిన్

First Published 12, Jun 2018, 2:45 PM IST
cricketer azharuddin responds on high court judgement
Highlights

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న టీం ఇండియా మాజీ సారథి 

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌ జోడు పదవులు అంశంపై హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అజారుద్దిన్ తెలిపారు. ఈ తీర్పుతో వివేక్ కు వ్యతిరేకంగా తమ ప్యానెల్ చేస్తున్న న్యాయపోరాటం గెలిచినట్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఎట్టకేలకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని, ఇకపై ఏం జరగాలన్న దానిపై జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి నిర్ణయిస్తామని అజారుద్దిన్ తెలిపారు. 

వివేక్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్ సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు విరుద్దమంటూ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపి అజారుద్దిన్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై  అంబుడ్స్ మెన్ జస్టిస్ నర్సింహ రెడ్డి  హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి వివేక్‌ ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై వివేక్ హైకోర్టు ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు సింగిల్ జడ్జి అంబుడ్స్ మెన్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వివేక్ కు పదవీ గండం నుండి తప్పించుకున్నాడు.

అయితే హై కోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై అజారుద్దిన్ అప్పీలు దాఖలు చేశాడు. దీంతో గతంలో అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును సమర్ధించిన కోర్టు.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్‌ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది.
 

loader