తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కరే కాదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎం మహా జన పాదయాత్ర సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా లో పర్యటిస్తున్న తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆదిలాబాద్ అంటురోగాలు, పాలమూరు వలసలు, నల్లగొండ ఫ్లోరైడ్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి దుబాయ్ వలసలు పోవడం ఆగిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదని, సామాజిక న్యాయంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కరే కాదని.. ప్రజలు కూడా అనే విషయం ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలన్నారు.మహబూబ్‌నగర్ జిల్లా లోని ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
