Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌తో పొత్తుకు రాంరాం: 17 స్థానాల్లో పోటీ చేస్తామన్న తమ్మినేని

కాంగ్రెస్ తీరుపై లెఫ్ట్ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి.   పొత్తు విషయంలో  చెప్పిన మాటలకు ఆచరణకు మధ్య వ్యత్యాసం ఉందని  లెఫ్ట్ పార్టీ నేతలు చెబుతున్నారు. 

 CPM Releases  17 names for Telangana Assembly Elections  2023 lns
Author
First Published Nov 2, 2023, 4:21 PM IST

హైదరాబాద్:  తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది.  17 స్థానాల్లో  అభ్యర్థుల జాబితాను  సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం   ప్రకటించారు.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  గురువారంనాడు  పార్టీ కార్యాలయంలో  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఒంటరిగా పోటీ చేస్తామని  సీపీఎం తేల్చి చెప్పింది. చర్చల సమయంలో  ఎన్నో  మెట్లు దిగినట్టుగా తమ్మినేని వీరభధ్రం ప్రకటించారు.

భద్రాచలం, ఆశ్వరావుపేట, వైరా,పాలేరు, మధిర,జనగామ, పటాన్ చెరు, ముషీరాబాద్, మిర్యాలగూడ, నల్గొండ,నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్ణణం స్థానాల్లో  పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని వీరభధ్రం ప్రకటించారు.

తమకు కేటాయిస్తామన్న స్థానాలను కూడ కాంగ్రెస్ కేటాయించలేదని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.మిర్యాలగూడతో పాటు పాలేరు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కోరినట్టుగా  తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే  పాలేరు సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సానుకూలతను వ్యక్తం చేయలేదన్నారు.
సీట్ల విషయంలో  సీపీఎం పంతాలకు పోతుందని తమపై దుష్ప్రచారం చేశారని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే  వైరా అసెంబ్లీ సీటును ఇస్తామని  కాంగ్రెస్ నుండి ప్రతిపాదన వచ్చిందన్నారు. అయితే సీపీఐ, సీపీఎంల చర్చల్లో భాగంగా వైరా స్థానంలో సీపీఐ పోటీ చేయాలని తమ మధ్య అంగీకారం ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి చెబితే  వైరా సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

భద్రాచలం, పాలేరు రెండు సీట్లను వదిలేసి  చర్చల్లో  చాలా మెట్లు దిగినట్టుగా తమ్మినేని వీరభద్రం వివరించారు. అయితే మిర్యాలగూడ, వైరా  అసెంబ్లీ సీట్లివ్వాలని తాము కాంగ్రెస్ వద్ద ప్రతిపాదించినట్టుగా తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే  వైరా అసెంబ్లీ సీటు ఇస్తామని తాము ఏనాడూ చెప్పలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  తేల్చి చెప్పారు.అఖిలభారత స్థాయిలో జరిగిన చర్చల్లోనూ, రాష్ట్ర స్థాయిలో జరిగిన చర్చల్లో  వైరా అసెంబ్లీ సీటు కేటాయింపు విషయమై  చర్చ జరిగిందని తమ్మినేని వీరభధ్రం గుర్తు చేశారు.

అయితే  తమకు ఏ సీట్లు ఇస్తారో చెప్పాలని  కాంగ్రెస్ ను కోరితే  మిర్యాలగూడతో పాటు హైద్రాబాద్ లో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇస్తామని  కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తమకు సమాచారం ఇచ్చారన్నారు.  హైద్రాబాద్ లో ఏ సీటు ఇస్తారో కూడ వారికే తెలియదన్నారు.

ఈ విషయాలపై అఖిలభారత నాయకత్వంతో చర్చించామన్నారు. ఈ విషయాలపై రాష్ట్ర కమిటీలో కూడ చర్చించినట్టుగా  తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇంత అవమానకరంగా  పొత్తులకు వెళ్లాల్సిన అవసరం లేదని   నిర్ణయం తీసుకున్నామన్నారు.పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు తమకు కూడ పొత్తు అవసరం లేదని సీపీఎం నేత తేల్చి చెప్పారు. ఇది కోరుకున్న  పరిణామం కాదన్నారు. ఇందుకు సీపీఎం బాధ్యత వహించదని చెప్పారు. 

also read:నేడు మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్ లైన్: స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి

లెప్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు.  ఎమ్మెల్సీ పదవులను తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే  సోనియా, రాహుల్ తో మాట్లాడి లెఫ్ట్ పార్టీల నేతలకు  మంత్రి పదవిని కేటాయిస్తామని  చేస్తున్న ప్రకటనలను ఆయన గుర్తు చేశారు.  1996లో ప్రధాన మంత్రి పదవిని ఇస్తామంటేనే తృణ ప్రాయంగా వదులుకున్న  చరిత్ర సీపీఎంకు ఉందని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ తో పొత్తుకు కుదరకపోతే  తమతో సీపీఐ కలిసి వస్తే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. ఏదైనా  స్థానంలో  బీజేపీని ఓడించే అభ్యర్ధికి ఓటేస్తామని  తమ్మినేని వీరభధ్రం  స్పష్టం చేశారు.  సీపీఐ, సీపీఎంల ఎమ్మెల్యేలు  అసెంబ్లీలో ఉంటేనే ప్రజల హక్కులు రక్షించబడతాయన్నారు.  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో  సీపీఐ పోటీ చేసినా ఆ స్థానాల్లో  ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని  తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios