ఒంటరిపోరుకు సీపీఎం: నాడు కలిసొచ్చినా, నేడు కలిసొస్తుందా?
సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ తీరుపై లెఫ్ట్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఒంటరిపోరుకు సీపీఐ, సీపీఎం రంగం సిద్దం చేసుకుంటున్నాయి. మరోవైపు పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ ప్రకటించింది.
హైదరాబాద్: ఒంటరిపోరు గతంలో ఒక్క సారి మాత్రమే సీపీఎంకు కలిసి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒంటరిపోరు సీపీఎంకు కలిసి వచ్చే అవకాశం ఉండదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం 1999 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కమ్యూనిష్టు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. పొత్తులు కొన్ని సమయాల్లో కమ్యూనిష్టు పార్టీలకు కలిసి వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిష్టు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. 1952, 1957 ఎన్నికల సమయంలో కమ్యూనిష్టు పార్టీలు గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లను దక్కించుకున్నాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులలో కమ్యూనిష్టుల బలం కూడ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇతర పార్టీల పొత్తులపై ఆధారపడితేనే విజయం సాధించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో మాత్రం ఒంటరిగా పోటీ చేసినా కూడ విజయం సాధించిన సందర్భాలు కూడ కమ్యూనిష్టులకు ఉంది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
1985 ఎన్నికల్లో టీడీపీతో ఉభయ కమ్యూనిష్టు పార్టీలు పోటీ చేశాయి.1989, 1994 ఎన్నికల్లో కూడ ఉభయ కమ్యూనిష్టు పార్టీలు టీడీపీతో పొత్తును కొనసాగించాయి. 1999 ఎన్నికల్లో టీడీపీతో ఉభయ కమ్యూనిష్టు పార్టీ పొత్తు తెగదెంపులు చేసుకుంది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
దీంతో కమ్యూనిస్టు పార్టీలు టీడీపీకి దూరమయ్యాయి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుండి నోముల నర్సింహయ్య తొలిసారిగా సీపీఎం అభ్యర్ధిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి సున్నం రాజయ్య విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో 45 స్థానాల్లో సీపీఐ పోటీ చేసింది. కానీ ఒక్క అసెంబ్లీ సీటులో కూడ ఆ పార్టీ విజయం సాధించలేదు.
also read:కాంగ్రెస్‌తో పొత్తుకు రాంరాం: 17 స్థానాల్లో పోటీ చేస్తామన్న తమ్మినేని
2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ కూడ ఈ కూటమిలో ఉన్నాయి. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా సీపీఐ నిర్ణయం తీసుకుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఉండాలని సీపీఎం కోరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీపీఎం కోరింది. 2004 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ సీపీఎం 9, సీపీఐ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది.2009 ఎన్నికల్లో సీపీఐ నాలుగు స్థానాల్లో, సీపీఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది.
2014 ఎన్నికల్లో కూడ సీపీఎం, సీపీఐలు చేరొక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్నాయి. 2018 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు ఒక్క సీటు కూడ దక్కలేదు. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు సఫలం కాలేదు. దీంతో ఒంటరి పోరు చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. 17 అసెంబ్లీ స్థానాల జాబితాను నిన్న సీపీఎం విడుదల చేసింది.