హుజూర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితికి తమ మద్ధతు ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది.

ఆర్టీసీ సమ్మె, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తదితర అంశాల నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్‌కు మద్ధతు ఇవ్వాలా వద్ద అన్న దానిపై సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.

ఈ భేటీలో టీఆర్ఎస్‌కు మద్ధతు ఉపసంహరించుకోవాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొండివైఖరి వీడి.. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేకే చెప్పినా, ఎవరు చెప్పినా, ముందు చర్చలు జరగాలని చాడ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యమంలో సీపీఐ అగ్రభాగాన ఉండి పోరాడుతుందని ఆయన వెల్లడించారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఎవరికి మద్ధతు ఇవ్వాలనే దానిపై అక్కడే సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.